FIFA World Cup: రొనాల్డో దృష్టిలో ఫేవరెట్‌ జట్టు ఇదే..!

బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ లెజండ్‌ రొనాల్డో(Ronaldo) తన ఫేవరెట్‌ జట్లు ఏవో చెప్పాడు. వాటిల్లో అర్జెంటీనా(Argentina) పేరు లేదు. 

Published : 14 Dec 2022 01:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్రెజిల్‌ సూపర్‌ స్టార్‌ రొనాల్డో(Ronaldo) దృష్టిలో ఈ సారి ఫిఫా ప్రపంచకప్‌ (FIFA World Cup) మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా(Argentina)కు దక్కే అవకాశాల్లేవు. ఫ్రాన్స్‌కే ఈ సారి కప్పు దక్కేందుకు అత్యధిక అవకాశాలున్నాయని అతడు పేర్కొన్నాడు. ‘‘అందరిలానే అర్జెంటీనా గెలుస్తుందని చెప్పి ఆత్మ వంచన చేసుకోను. కానీ, నేను ఫుట్‌బాల్‌ను చాలా ప్రేమగా చూస్తా. విజేత ఎవరైనా అభినందిస్తా. నేను మొదటి నుంచి అంచనా వేసిన ప్రకారం బ్రెజిల్‌, ఫ్రాన్స్‌ ఫైనల్లో ఉండాలి. ఇప్పుడు బ్రెజిల్‌ అక్కడ లేదు. కానీ, ఫ్రాన్స్‌ ఉంది. ప్రతి మ్యాచ్‌ పూర్తయ్యే కొద్దీ వారికి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికీ వారినే ఫేవరెట్లుగా చూస్తున్నాను’’ అని రొనాల్డో వివరించాడు.

‘‘మొరాకో ఆటతీరు బాగుంది. కానీ, వారు గెలుస్తారని అనుకోను. ఫ్రాన్స్‌ అత్యంత బలంగా ఉంది. వారి అటాక్‌, మిడ్‌ ఫీల్డ్‌, డిఫెన్స్‌ అద్భుతంగా ఉన్నాయి. ఇక కైలియాకు బలాలు, వేగం ఏమిటో తెలుసు. వాటిని గోల్‌ చేయడానికో.. గోల్‌కు అసిస్ట్‌ చేయడానికో వాడతాడు. విజయం సాధించడానికి అవసరమైన టైమింగ్‌, స్కిల్స్‌, తపన, ప్రతిభ అతడిలో ఉన్నాయి’’ అని బ్రెజిల్‌ సూపర్‌ స్టార్‌ రొనాల్డో విశ్లేషించాడు. రొనాల్డో 2002 ప్రపంచకప్‌ ఫైనల్లో జర్మనీపై కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్‌ సాధించాడు. ఈ మ్యాచ్‌లో గోల్స్‌ సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఈ ప్రపంచకప్‌ బ్రెజిల్‌ గెలుచుకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని