FIFA World Cup: అర్జెంటీనాపై గెలుపు.. దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించిన సౌదీ రాజు

అర్జెంటీనాపై సంచలన విజయాన్ని ఆ దేశ ప్రభుత్వం ప్రజలతో కలిసి నిర్వహించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు సెలవు ప్రకటించింది.

Updated : 23 Nov 2022 13:52 IST

రియాద్‌: ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనాపై సంచలన విజయం నమోదు చేసిన సౌదీ అరేబియా జట్టు సంబరాల్లో మునిగితేలుతోంది.  ఈ విజయోత్సవాలను ఆ దేశ ప్రభుత్వం ప్రజలతో కలిసి నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు సౌదీ రాజు సల్మాన్‌ బుధవారం దేశవ్యాప్త సెలవును ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుధవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. పాఠశాలలకు సెలవు ఇచ్చారు.

ప్రస్తుతం విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతుండగా ఈ వేడుకల కోసం వాటిని ఒకరోజు పాటు అధికారులు వాయిదా వేయనున్నారు. ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు స్థానిక అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం నగరంలోని అన్ని థీమ్ పార్కులు, వినోద కేంద్రాలలో ప్రవేశ రుసుం లేకుండానే అనుమతులు ఇవ్వనున్నట్లు సౌదీ అరేబియా జనరల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అథారిటీ అధిపతి టర్కీ అల్‌ షేక్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

గ్రూప్‌-సిలో అత్యంత బలహీనమైన జట్టుగా ఉన్న సౌదీ.. టైటిల్‌ ఫేవరెట్‌ అయిన అర్జెంటీనాను ఓడించి చరిత్ర సృష్టించింది. సౌదీ ఆటగాళ్లు, అభిమానుల కేరింతలతో స్టేడియం హోరెత్తిపోయింది. దేశ రాజధాని రియాద్‌లోనూ సంబరాలు మిన్నంటాయి. రహదార్లపై ప్రయాణికులు జాతీయ జెండాలతో సందడి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని