Ravi Shastri: టీమ్‌ఇండియా మరో ఆల్ రౌండర్‌ని వెతుక్కోవాలి: రవిశాస్త్రి

టీమ్‌ఇండియా వీలైనంత త్వరగా మరో ఆల్ రౌండర్‌ని వెతుక్కోవాలని మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. వెన్నెముక గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన హార్దిక్‌ పాండ్య.. మళ్లీ జట్టులో చోటు దక్కించుకోవాలంటే బ్యాటింగ్‌తో పాటు మరో విభాగంలో..

Published : 24 Mar 2022 01:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా వీలైనంత త్వరగా మరో ఆల్ రౌండర్‌ని వెతుక్కోవాలని మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. వెన్నెముక గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన హార్దిక్‌ పాండ్య.. మళ్లీ జట్టులో చోటు దక్కించుకోవాలంటే బ్యాటింగ్‌తో పాటు మరో విభాగంలో నైపుణ్యం సాధించాలని సూచించాడు. పాండ్యను పూర్తి స్థాయి బ్యాటర్‌గా జట్టులోకి తీసుకోవాలనే వాదనను శాస్త్రి తోసిపుచ్చాడు.

‘టీమ్‌ఇండియాలో ఆరో స్థానంలో రాణించగల ఆల్‌ రౌండర్‌ అవసరం ఉంది. టాప్-5లో ఎవరో ఒకరు రెండు మూడు ఓవర్లు బౌలింగ్ చేస్తే చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది. అప్పుడు జట్టులో ఆరున్నర మంది బౌలర్లు ఉన్నట్లు అవుతుంది. కెప్టెన్‌పై కూడా భారం తగ్గుతుంది. ప్రస్తుతం భారత జట్టులో తీవ్రమైన పోటీ ఉంది. యువ ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్య జట్టులో చోటు దక్కించుకోవాలంటే బ్యాటింగ్‌తో పాటు మరో విభాగంలో నైపుణ్యం సాధించాలి. పాండ్య మళ్లీ ఆల్ రౌండర్‌గా రాణించగలిగితే ఆటోమేటిక్‌గా జట్టులో చోటు దక్కించుకున్నట్లే. టీమ్‌ఇండియా బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. ఫాస్ట్ బౌలింగ్‌, ఫీల్డింగ్ డిపార్ట్‌మెంట్లో స్వల్ప మార్పులు చేయాల్సి ఉంది’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్య మునుపటి స్థాయిలో రాణించలేకపోతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే భారత జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న పొట్టి ఫార్మాట్లో రాణించి.. మళ్లీ టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకుంటాడేమో చూడాలి.!

మార్క్‌ వుడ్ స్థానంలో ఆండ్రూ టై

మోచేతి గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ) ఆటగాడు మార్క్ వుడ్‌ స్థానంలో ఆండ్రూ టై ఆడనున్నాడు. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 27 మ్యాచులు ఆడిన టై.. 40 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో మార్క్‌ వుడ్ గాయపడిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని