Sanju Samson: సంజూ శాంసన్‌ భారత్‌ తరఫున మరిన్ని మ్యాచ్‌లు ఆడాల్సింది

రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ టీమ్‌ఇండియా తరఫున మరిన్ని మ్యాచ్‌లు ఆడాల్సిందని పాకిస్థాన్‌ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 05 Apr 2022 17:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ టీమ్‌ఇండియా తరఫున మరిన్ని మ్యాచ్‌లు ఆడాల్సిందని పాకిస్థాన్‌ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ సూచించాడు. శాంసన్‌ 2015లోనే భారత జట్టు తరఫున టీ20ల్లో అరంగేట్రం చేసినా ఇప్పటికీ కేవలం 13 మ్యాచ్‌లే ఆడాడు. మరోవైపు టీ20 లీగ్‌లో 123 మ్యాచ్‌లు ఆడిన అతడు మొత్తం 3,153 పరుగులు చేశాడు. అందులో 3 శతకాలు, 16 అర్ధ శతకాలు సాధించడం విశేషం. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్‌ మరికాసేపట్లో బెంగళూరుతో మ్యాచ్‌ ఆడాల్సి ఉన్న పరిస్థితుల్లో అక్తర్‌ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడాడు. ఈ సందర్భంగా సంజూ, బట్లర్‌తో పాటు ఆ జట్టు ప్రదర్శనపైనా స్పందించాడు.

‘ఈసారి రాజస్థాన్‌ బలంగా కనిపిస్తోంది. కొత్త జట్టు, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. అయితే, ఈ జట్టు వేలంలో ఇంతకుముందెప్పుడూ స్థానిక ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇచ్చేది. దీంతో తక్కువ మొత్తం ఖర్చు చేసి విజయాలు సాధించాలని చూసేది. అలాంటి జట్టు ఈసారి బాగా ఆడుతోంది. ఆటగాళ్లు విజయాలు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లు ఇలాగే కొనసాగితే రాజస్థాన్‌కు చాలా మంచిది. ప్రస్తుత సీజన్‌లో టాస్‌లు ఓడినా ఆ జట్టు మ్యాచ్‌లు గెలుస్తోంది. దీంతో వాళ్ల ఆలోచనా దృక్పథం, జట్టుగా కలిసికట్టుగా ఆడాలనే కసి కనిపిస్తోంది’ అని అక్తర్‌ పేర్కొన్నాడు.

అనంతరం ముంబయితో జరిగిన మ్యాచ్‌లో శతకంతో రాణించిన ఓపెనర్‌ జోస్‌బట్లర్‌ గురించి మాట్లాడుతూ.. ‘ఇంగ్లాండ్‌ జట్టు బెన్‌స్టోక్స్‌కు బదులు బట్లర్‌ను ప్రోత్సహించి ఉంటే అతడు సూపర్‌స్టార్‌గా ఎదిగేవాడు. ఈ ఓపెనర్‌ ఎక్కడైనా పరుగులు చేయగలడు. ఎలాంటి పిచ్‌మీదైనా రాణిస్తాడు. బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయిస్తాడు. అతడిలో ఎంతో నైపుణ్యం ఉంది. అయితే, అతడికి దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఇప్పటివరకూ బట్లర్‌ను ఎవరూ పెద్దగా గుర్తించలేదు’ అని వివరించాడు. ఈ క్రమంలోనే చివరికి సంజూ గురించి మాట్లాడుతూ.. టీమ్‌ఇండియా తరఫున అతడు మరిన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సిందన్నాడు. అతడు అద్భుతమైన ఆటగాడని, దురదృష్టంకొద్దీ భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోయాడని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని