Shreyas Iyer: మా ఓటమికి సాకులు లేవు.. ఇకపై భయంలేకుండా ఆడాలి: శ్రేయస్

దిల్లీతో తలపడిన మ్యాచ్‌లోనూ ఓటమిపాలవ్వడంతో కోల్‌కతా ఈ సీజన్‌లో వరుసగా ఐదో మ్యాచ్‌ కోల్పోయింది. దీంతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది...

Published : 29 Apr 2022 09:18 IST

(Photo: Shreyas Iyer Instagram)

ముంబయి: దిల్లీతో తలపడిన మ్యాచ్‌లోనూ ఓటమిపాలవ్వడంతో కోల్‌కతా ఈ సీజన్‌లో వరుసగా ఐదో మ్యాచ్‌ కోల్పోయింది. దీంతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌.. తమ ఓటమికి సాకులేమీ చెప్పట్లేదని తెలిపాడు. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో తెలుసుకోవాలని చెప్పాడు.

‘మేం చాలా పేలవంగా ఆరంభించాం. ఆదిలోనే వికెట్లు కోల్పోయాం. పిచ్‌ నెమ్మదిగా ఉన్నా మేం తగినన్ని పరుగులు చేయలేకపోయాం. మా ఓటమికి కారణాలేం లేవు. తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవాలి. మా టాప్‌ఆర్డర్‌లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సరైన కాంబినేషన్‌ కనుగొనడానికి కష్టంగా ఉంది. ఇకపై సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. భయం వీడి దూకుడుగా ఆడాలి. ఇంకా ఐదు మ్యాచ్‌లు ఉన్నాయి. వాటిల్లో బాగా ఆడాలి. జట్టులో నమ్మకం కలిగించి యాజమాన్యం నమ్మకాల్ని నిలబెట్టుకోవాలి. జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఇకపై గెలవడానికి కృషిచేయాలి. శక్తిమేరకు రాణించి విఫలమైనా పర్లేదు. ఉమేశ్‌ తొలి ఓవర్‌లోనే వికెట్‌ తీసినా 11 పరుగులిచ్చాడు. అక్కడే మ్యాచ్‌ టర్న్‌ అయింది. అయినా, ఈ సీజన్‌లో అతడు మాకు మంచి శుభారంభాలు అందించాడు’ అని శ్రేయస్‌ అభిప్రాయపడ్డాడు.

కాగా, కోల్‌కతా జట్టుకు ఈ సీజన్‌లో ఇది వరుసగా ఐదో ఓటమి. ఇంతకుముందు 2009లో బ్రెండన్‌ మెక్‌కలమ్‌ సారథ్యంలో ఆ జట్టు వరుసగా 9 మ్యాచ్‌లు కోల్పోయింది. ఇక 2019లోనూ దినేశ్‌ కార్తీక్‌ సారథ్యంలో ఆ జట్టు వరుసగా 6 ఓటములు చవిచూసింది. ఇప్పుడు శ్రేయస్‌ మరో మ్యాచ్‌ కోల్పోతే కార్తీక్‌ సరసన నిలిచి అనవసరపు రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని