BCCI: బీసీసీఐ అధ్యక్షుడి మార్పుపై రవిశాస్త్రి.. జీవితంలో ఏదీ శాశ్వతం కాదన్న మాజీ కోచ్!

బీసీసీఐకి కొత్త అధ్యక్షుడి రాక ఖరారైనట్టే. గంగూలీ స్థానంలో రోజర్‌ బిన్నీ వచ్చేస్తాడు. భారత్‌కు మొదటి వన్డే ప్రపంచకప్‌ అందించిన జట్టులో కీలక సభ్యుడు రోజర్‌ బిన్నీ. మరి తన పాత సహచరుడిని అధ్యక్ష స్థానంలో చూడనుండటంపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. 

Published : 14 Oct 2022 19:10 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్‌ బోర్డు.. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ).. టీమ్ఇండియాకు తొలి ప్రపంచకప్‌ను అందించిన కపిల్‌ సేనలో కీలక సభ్యుడు, మాజీ ఆటగాడు రోజర్‌ బిన్నీ కొత్త అధ్యక్షుడిగా రావడం ఖాయంగా కనిపిస్తోంది. అక్టోబర్‌ 18వ తేదీన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. వరుసగా రెండోసారి ప్రెసిడెంట్‌గా వద్దామని భావించినా సాధ్యపడలేదు. ఈ క్రమంలో బీసీసీఐ అధ్యక్ష పదవిపై టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. 1983 ప్రపంచకప్‌ జట్టులో రోజర్‌ బిన్నీ, రవిశాస్త్రి సహచరులు కావడం విశేషం. రోజర్‌ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా వస్తాడనే వార్తలను స్వాగతిస్తున్నట్లు రవిశాస్త్రి వెల్లడించాడు. 

‘‘రోజర్‌ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా వస్తాడని ప్రచారం సాగుతోంది. నాకెంతో ఆనందంగా ఉంది. ప్రపంచకప్‌లో నా సహచరుడు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం అతడికి ఉంది. ఇప్పుడు టాప్‌ పోస్టులోకి రాబోతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం.. బీసీసీఐ చరిత్రలో భారత్‌కు తొలి వన్డే ప్రపంచకప్‌ను అందించిన జట్టులోని సభ్యుడు బాస్‌గా రావడం అద్భుతం’’ అని తెలిపాడు. రోజర్‌ బిన్నీ మాత్రమే బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం నామినేషన్‌ దాఖలు చేశారు. ఏకగ్రీవంగాఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

వరుసగా రెండోసారి బీసీసీఐ అధ్యక్ష పదవిని గంగూలీ ఆశించినా.. ఇతర సభ్యుల నుంచి పెద్దగా మద్దతు లేకపోవడంతో విరమించుకొన్న విషయం తెలిసిందే. దానిపైనా రవిశాస్త్రి స్పందించాడు. ‘‘వరుసగా రెండోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా అయినవారు ఎవరూ లేరు. ఇప్పుడు మరొక క్రికెటర్‌కు అవకాశం వచ్చిందనుకోవాలి. ఎందుకంటే జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. కొంతకాలం కేటాయించిన విధులు నిర్వర్తించడమే మన బాధ్యత. ఆ తర్వాత ముందుకు సాగిపోవడమే జీవితం. ఇక రోజర్ బిన్నీ సామర్థ్యం ప్రశ్నించలేం. అంతేకాకుండా వరల్డ్ కప్‌ విన్నింగ్‌ టీమ్‌లో సభ్యుడు. అందుకే బీసీసీఐ అధ్యక్షుడిగా అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. కేవలం అగ్రశ్రేణి ఆటగాళ్లను మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రతి ప్లేయర్‌కు మంచి చేయగలడని భావిస్తున్నా. స్వతంత్రంగా పనిచేయగల సమర్థుడు. క్రికెట్‌కు సంబంధించిన అంశాలపై గట్టిగా మాట్లాడగలడు’’ అని రవిశాస్త్రి వెల్లడించాడు. క్రికెట్ మైదానల్లో మౌలిక సదుపాయాలు, వసతులు ఇంకా వృద్ధి చెందాలని ఆకాంక్షిచాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని