AFG vs SL: రాణించిన అఫ్గానిస్థాన్‌ బౌలర్లు.. శ్రీలంక 241 ఆలౌట్

ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది.

Published : 30 Oct 2023 18:04 IST

పుణె: ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ పాథుమ్ నిశాంక (46; 60 బంతుల్లో 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నె (15) పరుగులకే వెనుదిరిగాడు. కుశాల్ మెండిస్ (39; 50 బంతుల్లో 3 ఫోర్లు), సదీర సమరవిక్రమార్క (36; 40 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఎంజొలో మాథ్యూస్‌ (23; 26 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌), చరిత్ అసలంక (22), ధనంజయ డి సిల్వా (14) తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరారు. టెయిలెండర్ మహీశ్ తీక్షణ (29; 31 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడాడు. అఫ్గానిస్థాన్‌ బౌలర్లలో ఫజల్ హక్‌ ఫారూఖీ 4,   ముజిబుర్ రహ్మన్ 2, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, రషీద్‌ఖాన్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే లంకకు షాక్ తగిలింది. దిముత్ కరుణరత్నెను ఫారూఖీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత వచ్చిన కుశాల్ మెండిస్‌తో కలిసి నిశాంక ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. అర్ధ శతకానికి చేరువైన నిశాంకను అజ్మతుల్లా వెనక్కి పంపాడు. కొద్దిసేపటి తర్వాత కుశాల్ మెండిస్‌, సదీర విక్రమార్కలను ముజిబుర్‌ వరుస ఓవర్లలో ఔట్‌ చేశాడు. కుశాల్.. నజిబుల్లాకు క్యాచ్‌ ఇవ్వగా.. సదీర విక్రమార్క ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ధనంజయను రషీద్‌ఖాన్ క్లీన్‌బౌల్డ్ చేయగా.. ఫారూఖీ బౌలింగ్‌ చరిత్‌ అసలంక రషీద్‌కు చిక్కాడు. కొద్దిసేపటికే దుష్మంత చమీర (1) రనౌటయ్యాడు. కాసేపు నిలకడగా ఆడిన మహీశ్‌ తీక్షణ ఫారూఖీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అవ్వగా.. మాథ్యూస్‌ని ఫారూఖీ ఔట్ చేశాడు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో మధుశంక (5) రనౌట్‌ అవ్వడంతో శ్రీలంక ఆలౌటైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని