MS DHONI: ధోనీ 15 ఏళ్ల కిందట ఉన్నంత దూకుడుగా ఉండలేడు కదా: సీఎస్‌కే కోచ్

ఐపీఎల్ (IPL 2023) 16వ సీజన్‌ను చెన్నై ఓటమితో ప్రారంభించింది. అయితే,  ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ ధోనీ బ్యాటింగ్‌లో దూకుడుగా ఉన్నప్పటికీ.. కీపింగ్‌లో మునుపటి వేగం కాస్త తగ్గిందని  క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేశారు.  దీనిపై సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రత్యేకంగా స్పందించాడు.

Published : 01 Apr 2023 12:36 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2023) 16వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ  (MS Dhoni) అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 41 ఏళ్ల 267 రోజుల వయసులో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. గతంలో షేన్‌ వార్న్ 41 ఏళ్ల 249 రోజుల వయసులో  రాజస్థాన్‌ సారథిగా వ్యవహరించాడు. అలాగే 15 ఏళ్ల కిందట తొలి ఐపీఎల్‌ టోర్నీ సందర్భంగా నిర్వహించిన ఫొటో షూట్‌లో ఉన్న ధోనీ.. తాజాగా 16వ సీజన్‌లోనూ ఉండటం విశేషం. ఇక, గత రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్‌పై ఏడు బంతుల్లో 14 పరుగులు సాధించి ధోనీ నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌లో ఒకప్పటి తనదైన శైలిలో భారీ షాట్లు కొట్టేందుకు ప్రయత్నించి సఫలమయ్యాడు. అయితే, కీపింగ్‌లో మాత్రం దూకుడుగా లేడనేది కాదనలేని వాస్తవం. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లోని దీపక్ చాహర్ వేసిన 19వ ఓవర్‌లో  తెవాతియా ప్యాడ్లను తాకి లెగ్‌సైడ్‌కు వెళ్తున్న బంతిని ఆపడంలో ధోనీ విఫలమవడంతో పాటు అతడి కండరాలు పట్టేశాయి. దీంతో అభిమానుల్లో కాస్త ఆందోళన రేగింది. కానీ, త్వరగానే సర్దుకున్న ధోనీ కీపింగ్‌ బాధ్యతలను పూర్తి చేశాడు. ఈ క్రమంలో ధోనీలో మునుపటి వేగం లోపించిందనే వ్యాఖ్యలు వినిపించాయి. వీటిపై సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ స్పందించాడు. 15 ఏళ్ల కిందట ఉన్న దూకుడు ఇప్పుడు ఎలా ఉంటుందని ప్రశ్నించాడు. 

‘‘ధోనీ నిరంతరం ఆడుతూనే ఉంటాడు. అయితే, అతడిలో వేగం లేదనే వార్తలు ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఈ సీజన్‌ ప్రారంభానికి ముందు వరకు మోకాలి నొప్పితో బాధపడ్డాడు. కానీ, ఈ మ్యాచ్‌లో కాలు తిమ్మిరి ఎక్కింది. మోకాలు నొప్పి కాదు. అతడు 15 ఏళ్ల కిందట ఎంత వేగంగా ఉన్నాడో ఇప్పుడు అలా ఉండలేడు. అయితే, ఇప్పటికీ ధోనీ గొప్ప నాయకుడు. బ్యాటింగ్‌లోనూ తనదైన దూకుడు ప్రదర్శించాడు. తన పరిస్థితిపై అతడికి పూర్తి అవగాహన ఉంది. మైదానంలో చాలా కీలకమైన ఆటగాడు. అతడొక దిగ్గజ క్రికెటర్‌. కాదంటారా..?’’ అని ఫ్లెమింగ్‌ వ్యాఖ్యానించాడు.

హంగార్గేకర్‌ సూపర్బ్‌: ఫ్లెమింగ్‌

యువ బౌలర్‌ రాజ్‌వర్థన్‌ హంగార్గేకర్ ప్రదర్శనపై ఫ్లెమింగ్‌ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌ అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శన ఇచ్చాడని ప్రశంసించాడు. అతడు కీలకమైన వృద్ధిమాన్‌ సాహా, సాయి సుదర్శన్, విజయ్‌ శంకర్ వికెట్లను పడగొట్టాడు. ‘‘ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శన ఇచ్చాడు. ఇప్పుడు ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లోనూ పరిణితితో బౌలింగ్‌ చేశాడు. అయితే, కొన్నింట్లో ఇంకాస్త మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. భారీ సంఖ్యలో హాజరమైన అభిమానుల మధ్య తొలి మ్యాచ్‌ ఆడటం కాస్త ఒత్తిడికి గురి చేస్తుంది. కానీ, హంగార్గేకర్ మాత్రం గొప్ప ప్రదర్శనే చేశాడు’’ అని అభినందించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని