AUS vs SA: సఫారీలతో మ్యాచ్‌.. స్మిత్ సెంచరీకి ఆ రికార్డులు బద్దలు

ఆస్ట్రేలియా బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌(Aus vs SA)లో సెంచరీతో దిగ్గజ ఆటగాడిని అధిగమించాడు.

Published : 05 Jan 2023 14:58 IST

సిడ్నీ: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో భాగంగా రెండో రోజు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌(Steven Smith) అరుదైన ఘనత అందుకున్నాడు. డాన్‌ బ్రాడ్‌మాన్‌ రికార్డును బద్దలుకొడుతూ టెస్టు కెరీర్‌లో 30వ శతకాన్ని నమోదు చేశాడు. అన్‌రిచ్‌ నోర్జె వేసిన బంతిని అద్భుతమైన షాట్‌ ఆడి 190 బంతుల్లో ఈ మైలు రాయిని అందుకున్నాడు. అనంతరం దక్షిణాఫ్రికా ఆటగాడు కేశవ్‌ మహరాజ్‌ చేతిలో 104 పరుగుల వద్ద ఔట్‌ అయ్యి పెవిలియన్‌కు చేరాడు.

ఈ సిరీస్‌లో కేశవ్‌కి ఇది తొలి వికెట్‌. మరోవైపు ఈ మ్యాచ్‌తో 8,647 పరుగులు పూర్తి చేసి మైకేల్‌ క్లార్క్‌ రికార్డును సైతం స్మిత్‌ అధిగమించాడు. ఈ ఘనతతో టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో అస్ట్రేలియా ఆటగాడిగా.. మొత్తంగా 14వ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం రికీ పాంటింగ్‌(41), స్టీవ్‌ వాగ్‌(32) మాత్రమే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. 

ఇక గురువారం మ్యాచ్‌లో రెండో రోజు టీ బ్రేక్‌ సమయానికి మరో ఆస్ట్రేలియా(Australia) బ్యాట్స్‌మెన్‌ ఉస్మాన్‌ ఖవాజా సైతం టెస్టుల్లో తన 13వ సెంచరీని అందుకున్నాడు. మూడో వికెట్‌కు స్మిత్‌తో కలిసి 209 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో ఆస్ట్రేలియా 350 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని