CWG 2022 : కామన్వెల్త్‌లో భారత్‌కు ఆరో స్వర్ణం

బర్మింగ్‌హామ్‌‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ ఖాతాలో ఆరో స్వర్ణం చేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన...

Updated : 05 Aug 2022 09:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బర్మింగ్‌హామ్‌‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ ఖాతాలో ఆరో స్వర్ణం చేరింది. దీంతో మొత్తం పతకాల సంఖ్య 20కి చేరింది. అందులో ఆరు బంగారు, ఏడు రజతం, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన పురుషుల పారా హెవీ వెయిట్‌లిఫ్టింగ్‌ కేటగిరీలో సుధీర్‌ బంగారు పతకం సాధించాడు. కామన్వెల్త్ గేమ్స్‌ రికార్డును అధిగమించడం విశేషం. 134.5 పాయింట్లతో సుధీర్‌ గోల్డ్‌ గెలుచుకోగా.. నైజీరియాకి చెందిన క్రిస్టియన్‌ 133.6 పాయింట్లతో రజతం, ఇంగ్లాండ్‌ పారా వెయిట్‌లిఫ్టర్‌ మిక్కీ యులే కాంస్య పతకం దక్కించుకున్నాడు. తొలి ప్రయత్నంలో 208 కేజీలు ఎత్తిన సుధీర్‌ తన రెండో విడతలో 212 కేజీలు ఎత్తేసి 134.5 పాయింట్లను సాధించాడు. 

27 ఏళ్ల సుధీర్‌ ఆసియాన్‌ పారా గేమ్స్‌లో రజతం గెలిచాడు. ఇప్పుడు కామన్వెల్త్‌లో ఏకంగా స్వర్ణం సాధించడం విశేషం. గత జూన్‌లో దక్షిణ కొరియా వేదికగా జరిగిన వరల్డ్‌ పారా పవర్‌లిఫ్టింగ్‌ ఆసియా-ఓసియన్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌లో తన అత్యుత్తమం 214 కేజీలు ఎత్తి రజతం దక్కించుకున్నాడు. 2013లో సోనిపట్‌లో పవర్‌లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ప్రారంభించాడు. సుధీర్‌ పతకం సాధించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని