లిటిల్‌ పాండ్య.. మీ నాన్నలా కావోయ్‌..!

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గతవారమే తండ్రిగా కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ జులై 30న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే...

Updated : 08 Dec 2022 17:55 IST

హార్దిక్‌ పాండ్య కుమారుడికి కేఎల్‌ రాహుల్‌ సలహా..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గతవారమే తండ్రిగా కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ జులై 30న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తల్లీ కుమారుడు పాండ్య ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే హార్దిక్‌ పాండ్య సోదరుడు, టీమ్‌ఇండియా క్రికెటర్‌ కృనాల్‌ పాండ్య తన తమ్ముడి కుమారుడిని ఎత్తుకొని సంబరపడ్డాడు. తాజాగా ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొన్న అతడు.. ‘మనం క్రికెట్‌ గురించి మాట్లాడుకుందాం’ అంటూ సరదా క్యాప్షన్‌ పెట్టాడు. అది చూసిన కేఎల్‌ రాహుల్‌ తనదైన శైలిలో స్పందించాడు. పాండ్య కుమారుడిని కూడా తండ్రిలాగే ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అవ్వమని చెప్పమంటూ కృనాల్‌కు సలహా ఇచ్చాడు. ఆ కామెంట్‌కు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. వేలాది మంది లైకులు కొట్టడమే కాకుండా ఫన్నీ కామెంట్లతో స్పందిస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. గతేడాది హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌ కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొని మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తీవ్ర విమర్శలు రావడంతో టీమ్‌ఇండియా యాజమాన్యం వారిద్దరిపై కొన్ని నెలలు నిషేధం విధించింది. ఇక ఐపీఎల్‌, ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఇద్దరూ మంచి ప్రదర్శన చేయడంతో మళ్లీ జట్టులో కలిసిపోయారు. ఈ క్రమంలోనే హార్దిక్‌ వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకొని కొద్ది నెలలు ఆటకు దూరమయ్యాడు. అదే సమయంలో ఈ ఏడాది జనవరి 1న దుబాయ్‌లోని సముద్ర జలాల్లో నటాషాకు తన ప్రేమను వ్యక్త పరిచి ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. తర్వాత ఫిట్‌నెస్‌ సాధించి దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడు. అయితే, అదే సమయంలో అతడు న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపికవ్వలేకపోయాడు. చివరికి లాక్‌డౌన్‌ సమయంలో తండ్రి కాబోతున్నట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ నేపథ్యంలోనే గత గురువారం నటాషా పురుడుపోసుకుందని, మగబిడ్డకు జన్మనిచ్చిందని వెల్లడించాడు. ఇప్పుడు సంతోషకరమైన సమయంలో తన కుమారుడితో పితృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని