Muralitharan: వీరూ 2 గంటల్లో 150, రోజంతా 300 పరుగులైనా చేసేస్తాడు..

పరుగుల రారాజు సచిన్‌ తెందూల్కర్‌కు బంతులు వేసేందుకు భయపడేవాడిని కాదని శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ అన్నాడు. అతడు ఎక్కువగా ఇబ్బంది పెట్టడని పేర్కొన్నాడు....

Published : 21 Aug 2021 10:26 IST

సచిన్‌కు ఆఫ్‌స్పిన్‌ బలహీనత..

దిల్లీ: పరుగుల రారాజు సచిన్‌ తెందూల్కర్‌కు బంతులు వేసేందుకు భయపడేవాడిని కాదని శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ అన్నాడు. అతడు ఎక్కువగా ఇబ్బంది పెట్టడని పేర్కొన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్‌, బ్రయన్‌ లారా అయితే బంతిని చితకబాదేవారని వెల్లడించాడు. వారికి బౌలింగ్‌ చేయడం ఎంతో కష్టంగా అనిపించేదని తెలిపాడు. ఈఎస్‌పీఎన్‌ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడాడు.

‘సచిన్‌కు బంతులేసేటప్పుడు భయం ఉండదు. ఎందుకంటే అతడెక్కువగా ఇబ్బంది పెట్టడు. అదే సెహ్వాగ్‌ అయితే గాయపరుస్తాడు. సచిన్‌ తన వికెట్‌ను కాపాడుకుంటాడు. బంతిని చక్కగా గమనించి ఆడతాడు. అతడికి టెక్నిక్‌ బాగా తెలుసు’ అని ముత్తయ్య అన్నాడు.

‘మాస్టర్‌కు ఆఫ్‌స్పిన్‌ ఆడటంలో కొద్దిగా బలహీనత ఉందని నేను గమనించాను. లెగ్‌స్పిన్‌ను అతడు బాదేసేవాడు. ఆఫ్‌స్పిన్‌లో మాత్రం కొద్దిగా తడబడేవాడు. అందుకే నేనతడిని చాలాసార్లు ఔట్‌ చేశాను. చాలామంది ఆఫ్‌ స్పిన్నర్లూ అతడిని ఔట్‌ చేయడం నేను చూశాను’ అని ముత్తయ్య తెలిపాడు.

‘ఎందుకో తెలియదు. నేనూ ఈ విషయం గురించి ఎప్పుడూ సచిన్‌తో చెప్పలేదు. అతడు ఆఫ్‌స్పిన్‌లో ఇబ్బంది పడతాడని నాకనిపించేది. అందుకే ఇతర ఆటగాళ్లతో పోలిస్తే నేను అతడిపై ఎక్కువ పైచేయి సాధించా. ఏదేమైనా సచిన్‌ గొప్ప ఆటగాడు. అతడిని ఔట్‌ చేయడం అంత సులభమైతే కాదు’ అని మురళీధరన్‌ అన్నాడు.

వీరేంద్ర సెహ్వాగ్‌, బ్రయన్‌ లారాకు బౌలింగ్‌ చేసేందుకు మాత్రం తాను భయపడేవాడినని ముత్తయ్య తెలిపాడు. ‘సెహ్వాగ్‌ అత్యంత ప్రమాదకారి. అతడి కోసం మేం డీప్‌లో, బౌండరీ సరిహద్దుల వద్ద ఫీల్డర్లను మోహరించేవాళ్లం. ఎందుకంటే అతడు అవకాశాలను వదులుకోడు. సహజశైలి ప్రకారం బంతిని బాదేస్తాడు. తనదైన రోజున ఎవరిపైనైనా దాడిచేస్తాను అన్నట్టుగా అతడి స్వభావం ఉండేది. అందుకే మేం అతడికి డిఫెన్సివ్‌ ఫీల్డింగ్‌ పెట్టి ఎప్పుడు పొరపాటు చేస్తాడా అని ఎదురు చూసేవాళ్లం’ అని మురళీధరన్‌ చెప్పాడు.

‘వీరేంద్ర సెహ్వాగ్‌లోని ప్రత్యేకత ఏంటంటే అతడు క్రీజులో రెండు గంటలు ఉంటే 150 రోజంతా ఆడితే 300 పరుగులు చేసేస్తాడు. అందుకే అలాంటి ఆటగాళ్లు ఎంతో ప్రమాదకరం’ అని ముత్తయ్య తెలిపాడు. ఇక ప్రస్తుత తరంలో తన బౌలింగ్‌ను విరాట్‌ కోహ్లీ, బాబర్‌ ఆజామ్‌ బాగా ఎదుర్కోగలరని అంచనా వేశాడు. వారిద్దరూ స్పిన్‌ను బాగా ఆడతారని తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని