Harbhajan Singh : ఆ దూకుడు వెనుక కఠోర శ్రమ.. టర్బోనేటర్‌ విజయ గాథ

కుంబ్లేతో కలిసి భారత స్పిన్‌ బౌలింగ్‌ దళాన్ని దాదాపు దశాబ్దన్నరపాటు నడపటంలో...

Updated : 25 Dec 2021 06:43 IST

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం

అతడికి కోపంతోపాటు దూకుడు ఎక్కువే.. జట్టులోని తోటి సభ్యులపైకే దూసుకెళ్తాడు.. బౌలింగ్‌ యాక్షన్‌పై ఎన్నో అనుమానాలు.. ఆరంభంలో అదిరిపోయే ప్రదర్శన ఇచ్చి అబ్బురపరిచాడు. తర్వాత ఫామ్‌ కోల్పోయి తంటాలు పడ్డాడు. అయితే ఆ కోపం వెనుక జట్టు గెలవాలనే తపన.. యువకుడిగా ఉన్నప్పుడు ఓటమిని తట్టుకోలేని తత్వం.. ఇలా అన్నింటినీ అనుభవించి కఠోరంగా శ్రమించి మరీ భారత జట్టులో అత్యుత్తమ ఆఫ్‌ స్పిన్నర్‌గా రాటుతేలాడు. ఆఫ్‌ స్పిన్నర్ అంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు హర్భజన్‌ సింగ్‌..  

కుంబ్లేతో కలిసి భారత స్పిన్‌ బౌలింగ్‌ దళాన్ని దాదాపు దశాబ్దన్నరపాటు నడపటంలో కీలక పాత్ర పోషించాడు. కఠినమైన సవాళ్లను ఎదుర్కొని మరీ భారత జట్టు విజయం సాధించడంలో ముఖ్య భూమిక వహించాడు. ధోనీ నాయకత్వంలో టీమ్‌ఇండియా సొంతం చేసుకున్న 2007 టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే ప్రపంచకప్‌ జట్టులో సభ్యుడు హర్భజన్‌ సింగ్‌.. సగటు క్రికెట్ అభిమాని టర్బోనేటర్, భజ్జీ అని మనం ముద్దుగా పిలుచుకునే హర్భజన్‌ సింగ్‌ శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేశాడు. ఈ క్రమంలో అతడి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.. 

వెలుగులోకి వచ్చిందప్పుడే..  


 

అంతర్జాతీయ క్రికెట్‌లోకి భారత జట్టు తరఫున 1998లో అడుగు పెట్టాడు. అయితే కొన్నాళ్లకే బౌలింగ్‌ యాక్షన్‌ మీద అనుమానాలు. వాటిలో పాసై అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు వచ్చిన ఛాన్స్‌లను భజ్జీ రెండు చేజేతులా ఒడిసి పట్టుకున్నాడు. రెగ్యులర్‌ స్పిన్నర్‌ అనిల్ కుంబ్లే గాయపడటంతో 2001 గావస్కర్ - బోర్డర్ సిరీస్‌ కోసం హర్భజన్‌కు పిలుపొచ్చింది. అప్పటికి భజ్జీ టెస్టుల్లో అత్యుత్తమ గణాంకాలు 3/30 మాత్రమే. అయితేనేమి గంగూలీ అతనిపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. వరుసగా 16 టెస్టు విజయాలను నమోదు చేసి విర్రవీగుతున్న ఆసీస్‌కు తన ఆఫ్‌ స్పిన్‌ దెబ్బ రుచి చూపించాడు. మూడు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో మొత్తం 32 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ నడ్డివిరిచాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా ఎంపికయ్యాడు. దీంతో పాటు టెస్టుల్లో తొలిసారిగా హ్యాట్రిక్ తీసిన మొదటి భారతీయ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 

దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ వన్డేల్లోకి.. 

ఆసీస్‌పై టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో హర్భజన్‌కి దాదాపు రెండేళ్ల తర్వాత వన్డే జట్టులోకి మళ్లీ పిలుపొచ్చింది. అయితే టెస్టుల్లో ప్రదర్శించిన ఫామ్‌ను కొనసాగించలేక తుది జట్టులో స్థానం నిలబెట్టుకోలేకపోయాడు. తర్వాత శ్రీలంక, జింబాబ్వే, న్యూజిలాండ్‌ సిరీసుల్లోనూ రాణించలేదు. మరోవైపు రెగ్యులర్‌ స్పిన్నర్ అనిల్‌ కుంబ్లే గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో హర్భజన్‌కు చోటు దక్కలేదు. ఫామ్‌ కోల్పోయిన ప్రతిసారీ కష్టపడి మరీ జట్టులోకి వచ్చేవాడు. అయితే 2003 వన్డే ప్రపంచకప్‌లో అనిల్‌ కుంబ్లేతో పాటు హర్భజన్‌ సింగ్‌ ఎంపికయ్యాడు. కుంబ్లే కేవలం మూడు మ్యాచ్‌లే ఆడగా.. ఫైనల్స్‌తో సహా టీమ్‌ఇండియా తరఫున పది మ్యాచుల్లో హర్భజన్‌ ఆడాడు. టోర్నమెంట్‌లో 3.92 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్‌ సందర్భంగా వేలికి గాయమైనా.. అలాగే ఆడేశాడు. టోర్నీ ముగిశాక వేలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. 2003 ఆఖర్లో భారత్‌ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ జరిగింది. అయితే అంతకుముందులా ఉత్తమ ప్రదర్శనను హర్భజన్‌ ఇవ్వలేకపోయాడు. 

భారత క్రికెట్‌లో చాపెల్‌ వ్యవహారం.. 

భారత క్రికెట్‌లో గ్రెగ్‌ చాపెల్‌ వివాదం పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. అప్పటి టీమ్‌ఇండియా సారథి సౌరభ్ గంగూలీ సహా పలువురు ఆటగాళ్లు చాపెల్‌ బాధితులే. వీరిలో హర్భజన్‌ కూడా ఉన్నాడు. హెడ్‌ కోచ్‌గా చాపెల్‌ ద్వంద్వ ప్రమాణాలతో ప్రవర్తిస్తున్నాడని భారత క్రికెట్ అథారిటీకి ఫిర్యాదు చేశాడు. అభద్రతాభావం, భయం సృష్టిస్తున్నాడని ఆరోపించాడు. అయితే కొన్నాళ్లకే చాపెల్‌ను ప్రశంసిస్తూ హర్భజన్‌ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘ చాపెల్‌కు ఆట పట్ల అపార జ్ఞానం ఉంది. చాపెల్‌ నేతృత్వంలో ఈ సంవత్సరం (2006) విజయవంతమవుతాం. ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు చాపెల్‌ ప్రయత్నిస్తున్నాడు’’అంటూ పేర్కొన్నాడు. చాపెల్‌ వివాదం నేపథ్యంలో సౌరభ్ గంగూలీ స్థానంలో రాహుల్‌ ద్రవిడ్‌ సారథ్య బాధ్యతలు చేపట్టిన విషయం మనందరికీ తెలుసు.  

2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌.. 

1983 వరల్డ్‌ కప్‌ తర్వాత టీమ్ఇండియా సాధించిన అతిపెద్ద టోర్నీల్లో 2007 టీ20 ప్రపంచకప్‌. నూతన సారథి ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత్‌ అద్భుత ప్రదర్శనతో సొంతం చేసుకుంది. టీ20 జట్టులోకి ఎంపికైన ప్రధాన స్పిన్నర్‌గా ఎంపికైన హర్భజన్‌ సింగ్‌ భారత్‌ తలపడిన ఆరు మ్యాచుల్లో ఆడాడు. అయితే 7.91 ఎకానమీతో కేవలం ఏడు వికెట్లను మాత్రమే తీశాడు. అయితే కొన్నాళ్లపాటు సరైన ఫామ్‌ లేకపోవడంతో జట్టులో సుస్థిర స్థానం దక్కించుకోలేకపోయాడు. ఒకానొక సమయంలో 2011 వన్డే ప్రపంచకప్‌కు కూడా ఎంపిక కావడం కష్టమేనని క్రికెట్‌ పండితులు భావించారు. అయితే తీవ్రంగా శ్రమించిన హర్భజన్‌ వారి అంచనాలను పటాపంచలు చేస్తూ 2011 వన్డే ప్రపంచకప్‌ టీమ్‌ఇండియా జట్టులో స్థానం సంపాదించాడు. అపూర్వ విజయంలో పాలుపంచుకున్నాడు.

వివాదాలూ ఉన్నాయ్‌.. 

అరంగేట్రం చేసిన తొలి సిరీస్‌లోనే (1998) వివాదం. మైదానంలో ప్రవర్తన సరిగా లేదని జరిమానాతోపాటు ఒక వన్డే మ్యాచ్‌ సస్పెండ్‌ అయిన సంఘటన చోటు చేసుకుంది. రికీ పాంటింగ్ ఔట్‌ విషయంలో అంపైర్‌ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాడు. దీనికే ఐసీసీ శిక్ష విధించింది. ఆసీస్‌ గడ్డ మీద ఆండ్రూ సైమండ్స్‌పై అసభ్యపదజాలం వాడినట్లు ఆరోపణలు రావడంతో మరోసారి ఐసీసీ శిక్షకు గురయ్యాడు. దీంతో మూడు టెస్టుల నిషేధం పడింది. అయితే విచారణ సందర్భంగా నిరూపణ కాకపోవడంతో నిషేధం తొలగింది. అయితే 50 శాతం వరకు మ్యాచ్‌ ఫీజ్‌ జరిమానా పడింది. తోటి ఆటగాడు శ్రీశాంత్‌పైనే దాడికి పాల్పడిన సంఘటన ఐపీఎల్‌లో చోటు చేసుకుంది. 2008లో ముంబయి, పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ముగిశాక.. ఆటగాళ్లందరూ షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకుంటున్నారు. ఆ మ్యాచ్‌లో పంజాబ్‌ విజయం సాధించడంలో శ్రీశాంత్‌ కీలక పాత్ర పోషించాడు. దీంతో అప్పటికే ఓటమి బాధలో ఉన్న హర్భజన్‌ వద్దకు శ్రీశాంత్‌ రావడంతో చెంప దెబ్బకొట్టాడు. దీంతో
ఆ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో హర్భజన్‌ పాల్గొనకుండా బ్యాన్‌ విధించింది. జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో హర్భజన్‌ క్రికెట్ కామెంట్రీతో పాటు దేశవాళీ లీగ్‌ల వైపు వెళ్లాడు. టీ20 వరల్డ్‌ కప్‌ (2021) పోటీల్లో పాకిస్థాన్‌ చేతిలో భారత్‌  ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్‌ క్రికెటర్‌ మహమ్మద్‌ ఆమిర్‌, హర్భజన్‌ మధ్య ట్విటర్‌ వేదికగా ఫైట్‌ జరిగింది. 

భజ్జీ.. టర్బోనేటర్‌ పేర్లు ఎలా వచ్చాయంటే..?

హర్భజన్‌ సింగ్‌ పేరు పలకడానికి ఇబ్బందిగా ఉండటంతో మాజీ క్రికెటర్‌ నయన్ మోంగియా ‘భజ్జీ’ అని పేరు పెట్టాడు. తర్వాత ఆ పేరుతోనే అతడు ఎక్కువగా ఫేమస్‌ అయ్యాడు. దీంతో 2009లో ఆ పేరుపై హర్భజన్‌ ‘పేటెంట్ హక్కు’ కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం భజ్జీ పేరుతో క్రీడా సామగ్రిని అమ్మే ఓ షాపుని కూడా నిర్వహిస్తున్నాడు. 2001లో బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. మూడు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అందులో హర్భజన్‌ సింగ్‌ 32 వికెట్లు తీసి సత్తా చాటాడు. టర్బైన్‌ మాదిరిగా బంతిని తిప్పే అతడి బౌలింగ్‌ యాక్షన్‌ను ఉద్దేశిస్తూ అప్పటి ఆసీస్‌ జర్నలిస్ట్‌ ఒకరు హర్భజన్‌ను ఉద్దేశించి ‘టర్బోనేటర్‌’ అనే పద ప్రయోగం చేసినట్లు క్రీడా విశ్లేషకులు పేర్కొన్నారు. 

హర్భజన్‌ గణాంకాలు ఇవీ.. 

అంతర్జాతీయంగా మూడు ఫార్మాట్లు కలిపి 360కిపైగా మ్యాచ్‌లు ఆడాడు. అందులో 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఉన్నాయి. టెస్టుల్లో (417 వికెట్లు) అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌. అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన 15/217. ఇక వన్డేల్లో (5/31) 269 వికెట్లు, టీ20ల్లో (4/12) 25 వికెట్లు పడొట్టాడు. పరుగుల పరంగా టెస్టుల, వన్డేలు, టీ20లు కలిపితే 3,600కిపైగా ఉన్నాయి. ఇవే కాకుండా మరో 163 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఉత్తమ ప్రదర్శన 5/18తో 150 వికెట్లు తీశాడు. 

హర్భజన్‌ టాప్‌ -5 బౌలింగ్‌ ప్రదర్శనలు

* కోల్‌కతా టెస్టు: 2001లో ఆసీస్‌పై మొదటి ఇన్నింగ్స్‌లో 7/123, రెండో ఇన్నింగ్స్‌లో 6/73 ప్రదర్శనతో అదరగొట్టాడు.

* ఆసీస్‌తో (2001) టెస్టు సిరీస్‌ సందర్భంగా జరిగిన మూడో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 7/133 స్పెల్‌తో ఇరగదీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అయితే 8/84తో ఆసీస్ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. 

* ఇక వన్డేల విషయానికొస్తే.. ముంబయి మైదానంలో (2005) ఆసీస్‌ మీద 5/29 గణాంకాలు సాధించాడు. దిల్లీ వేదికగా ఇంగ్లాండ్‌తో (2006) జరిగిన మ్యాచ్‌లో 5/31 ప్రదర్శనతో చెలరేగాడు. 

* టీ20ల్లోనూ మంచి ప్రదర్శనే ఇచ్చిన హర్భజన్‌.. 2012 టీ20 వరల్డ్‌ కప్‌లో కొలొంబో మైదానం వేదికగా ఇంగ్లాండ్‌పై (4/12) విజృంభించాడు.

హర్భజన్‌ గురించి మరికొన్ని విషయాలు..  

* హర్భజన్‌ తొలుత బ్యాటింగ్‌లో శిక్షణ తీసుకునేందుకు కోచ్ చరణ్‌జిత్ సింగ్‌ వద్ద చేరాడు. అయితే, కోచ్‌ అకాల మరణంతో మరో కోచ్ దవిందర్‌ అరోరా వద్ద శిక్షణలో చేరాడు. భజ్జీలోని టాలెంట్‌ను గుర్తించిన అరోరా స్పిన్‌ బౌలింగ్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. 

* భజ్జీ లక్కీ నంబర్‌ మూడు. హర్భజన్‌ సింగ్‌ పంజాబ్‌లో 1980 జులై 3న జన్మించాడు. తన  జెర్సీపై కూడా 3 నంబరే ఉండటం గమనార్హం. క్రికెట్‌లో అందించిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం నుంచి 2003లో అర్జున, 2009లో పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు. హర్భజన్‌ భార్య గీతా బస్రా. ఈ జంటకు ఒక బాబు, ఒక పాప.

* 2001లో ఆస్ట్రేలియాపై ప్రదర్శనకు అప్పటి పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ భజ్జీకి డీఎస్పీ పోస్టుని ఆఫర్‌ చేశాడు. అయితే, క్రికెట్‌పై పూర్తి దృష్టి పెట్టేందుకు ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు భజ్జీ.

* భజ్జీలో స్పిన్నర్‌తో పాటు మంచి నటుడు కూడా ఉన్నాడు. ముజ్‌సే షాదీ కరోగి (2004), భజ్జీ ఇన్ ప్రాబ్లెమ్‌ (2013), సెకండ్ హ్యాండ్ హస్బెండ్‌ (2015) ఫ్రెండ్‌షిప్‌(2021) చిత్రాల్లో నటించాడు. 

* సోషల్‌ మీడియాలో హర్భజన్‌ సింగ్‌ భలేగా యాక్టివ్‌గా ఉంటాడు. అంతే కాకుండా టీవీ షోల్లోకూ హాజరవుతూ ఉంటాడు. ఇప్పటికే కపిల్‌ శర్మ షో, అమితాబ్‌బచ్చన్ ‘కరోడ్‌పతి’ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని