IPL 2021: వార్నర్‌ మంచి మనసు.. జట్టు వదిలేసినా అభిమానం చాటుకున్నాడు 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ మళ్లీ జట్టుతో కలిసి స్టేడియానికి వచ్చాడు. ఆదివారం రాత్రి కోల్‌కతాతో తలపడిన సందర్భంగా స్టాండ్స్‌లో కూర్చొని హైదరాబాద్‌ టీమ్‌కు మద్దతు తెలిపాడు...

Published : 05 Oct 2021 01:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ మళ్లీ జట్టుతో కలిసి స్టేడియానికి వచ్చాడు. ఆదివారం రాత్రి కోల్‌కతాతో తలపడిన సందర్భంగా స్టాండ్స్‌లో కూర్చొని హైదరాబాద్‌ టీమ్‌కు మద్దతు తెలిపాడు. సన్‌రైజర్స్‌ జెండా పట్టుకొని ఆరెంజ్‌ ఆర్మీకి చీర్స్‌ కొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్‌ 25న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ టీమ్‌ అతడిని పక్కన పెట్టింది. 27న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. దీంతో వార్నర్‌ హోటల్‌ గదికే పరిమితమయ్యాడు. కనీసం టీవీలో జట్టు సభ్యులతోనూ కనిపించకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ జట్టుతో కలిసి రావడమే కాకుండా ఆరెంజ్‌ ఆర్మీ జెర్సీలో జెండా ఊపుతూ మద్దతు తెలిపాడు.

వార్నర్‌ 2014 నుంచీ ఈ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2016లో ఛాంపియన్‌గానూ నిలబెట్టాడు. ఏటా టాప్‌ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా రాణిస్తూ సన్‌రైజర్స్‌ను ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. అంత గొప్ప సారథిగా రాణిస్తున్న వార్నర్‌ ఈ ఏడాది ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. అదే సమయంలో జట్టు యాజమాన్యం తొలి దశలో అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించింది. ఇప్పుడు యూఏఈలో ఏకంగా తుది జట్టులోనుంచే తొలగించడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలోనే వార్నర్‌ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఒక కామెంట్‌ చేసి హైదరాబాద్‌ అభిమానులకు షాకిచ్చాడు. ఈ ఫ్రాంఛైజీ తరఫున ఇదే తన చివరి సీజన్‌ కావొచ్చని తెలిపాడు. కానీ, అందరూ జట్టుకు మద్దతు తెలపాలని కోరాడు.

మరోవైపు వార్నర్‌ను తుది జట్టులో నుంచి తొలగించినా రెండో దశలో సన్‌రైజర్స్‌ అదృష్టం ఏమీ మారలేదు. ఇప్పటివరకు మొత్తం 12 మ్యాచ్‌లు ఆడగా పది ఓటములతో అత్యంత ఘోర ప్రదర్శనతో కొనసాగుతోంది. గత మ్యాచ్‌లోనూ కోల్‌కతా చేతిలో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ఆ రెండింటిలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని