T20 World Cup: టీమ్‌ఇండియాలో ఎవరిని ఎలా ఎంపిక చేశామంటే.!  చీఫ్‌ సెలక్టర్‌  చేతన్‌ శర్మ

పరిమిత ఓవర్ల క్రికెట్లో శిఖర్‌ ధావన్‌ ఇప్పటికీ కీలకమైన ఆటగాడేనని చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ అన్నారు. ప్రస్తుతం ఇతర ఆటగాళ్లను చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికపై ఆయన మీడియాతో మాట్లాడారు....

Published : 09 Sep 2021 14:38 IST

ముంబయి: పరిమిత ఓవర్ల క్రికెట్లో శిఖర్‌ ధావన్‌ ఇప్పటికీ కీలకమైన ఆటగాడేనని చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ అన్నారు. ప్రస్తుతం ఇతర ఆటగాళ్లను చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికపై ఆయన మీడియాతో మాట్లాడారు.

‘శిఖర్‌ ధావన్‌ మాకు కీలకమైన ఆటగాడే. శ్రీలంకలో జట్టుకు నాయకత్వం వహించాడు. సెలక్షన్‌ కమిటీ ఏం చర్చిందన్నది మాత్రం చెప్పలేను. అతడు క్రికెట్‌ వ్యవస్థలోనైతే ముఖ్య భాగమే.  కానీ, అతడికి విశ్రాంతినిచ్చి ఇతర ఆటగాళ్లను చూడాల్సిన అవసరం ఉంది. త్వరలోనే అతడు జట్టులోకి వస్తాడు’ అని చేతన్‌ అన్నారు.

‘మనకు ముగ్గురు ఓపెనర్లు ఉన్నారు. రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగే కాకుండా మిడిలార్డర్‌లోనూ రాణించగలరు. కిషన్‌ను వేర్వేరు అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. లంకతో వన్డేల్లో అతడు ఓపెనింగ్‌ చేశాడు. మిడిలార్డర్లోనూ ఆడాడు. ఇక విరాట్‌ కోహ్లీ ఓపెనింగ్‌ చేస్తాడా అన్నది జట్టు యాజమాన్యం నిర్ణయిస్తుంది. మేమైతే ముగ్గురు ఓపెనర్లనే ఎంపిక చేశాం. విరాట్‌ జట్టుకు ప్రధాన ఆస్తి. టీ20ల్లో మిడిలార్డర్లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది’ అని చేతన్‌ తెలిపారు.

రిషభ్‌ పంతే తమ తొలి ప్రాధాన్య వికెట్‌ కీపరని చేతన్‌ స్పష్టం చేశారు. రెండో ప్రాధాన్యం కిషన్‌కు ఇస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కేఎల్‌ రాహుల్‌ వికెట్లను కాచుకుంటాడని తెలిపారు. ఇప్పటికైతే అతడిని స్పెషలిస్టు ఓపెనర్‌గానే ఎంపిక చేశామన్నారు. ఇక రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌ను ఆల్‌రౌండర్ల కోటాలో తీసుకున్నామని వెల్లడించారు. వికెట్లు టర్న్‌ అయితే రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ అవసరం అవుతారని పేర్కొన్నారు.

యుజ్వేంద్ర చాహల్‌ పేరు చర్చకు వచ్చిందని, అయితే వేగంగా స్పిన్‌ చేసే బౌలర్‌ అవసరమని గ్రహించి రాహుల్‌ చాహర్‌ను తీసుకొన్నట్లు చేతన్‌ అన్నారు. బౌలింగ్‌లో వైవిధ్యం అవసరం కాబట్టే నాలుగో పేసర్‌గా హార్దిక్‌ను ఎంచుకున్నామని తెలిపారు. ఎడమచేతి వాటం పేసర్‌ కోణంలో టి.నటరాజన్ గురించి ఆలోచించినా.. గాయం వల్ల చాలా కాలంగా అతడు క్రికెట్‌ ఆడలేదని గుర్తు చేశారు.

అశ్విన్‌ విషయానికి వస్తే అతడు క్రమం తప్పకుండా ఐపీఎల్‌లో రాణిస్తున్నాడని చేతన్‌ తెలిపారు.  దుబాయ్‌, యూఏఈ పిచ్‌లు, పరిస్థితులపై అవగాహన ఉన్న ఆఫ్‌స్పిన్నర్‌ అవసరం ప్రపంచకప్‌లో భారత్‌కు ఉందన్నారు. వాషింగ్టన్‌ సుందర్‌ గాయపడటంతో అతడిని ఎంపిక చేసినట్లు వివరించారు. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి లంకలో రాణించాడని, అతడిని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు కష్టమేనని వెల్లడించారు. శ్రేయస్‌ అయ్యర్‌ గాయం నుంచి ఈ మధ్యే కోలుకోవడంతో రిజర్వుగా ఎంపిక చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని