Michael Vaughan: టీమ్‌ఇండియానే అందరికన్నా ముందన్న దాదా.. కాదన్న వాన్‌

ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌కు టీమ్‌ఇండియా విజయాలన్నా.. ప్రదర్శనలన్నా ఇంకా చిన్నచూపే! ఏదో ఒక రకంగా భారత్‌ను తక్కువ చేసేలా సోషల్‌ మీడియాలో స్పందిస్తుంటాడు....

Published : 07 Sep 2021 18:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌కు టీమ్‌ఇండియా విజయాలన్నా.. ప్రదర్శనలన్నా ఇంకా చిన్నచూపే! ఏదో ఒక రకంగా భారత్‌ను తక్కువ చేసేలా సోషల్‌ మీడియాలో స్పందిస్తుంటాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని పరోక్షంగా ఎగతాళి చేస్తుంటాడు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ట్వీటుకు అతడు బదులివ్వడమూ అలాగే అనిపించింది!

ఓవల్‌ మైదానంలో టీమ్‌ఇండియా తిరుగులేని విజయం అందుకొన్న సంగతి తెలిసిందే. 50 ఏళ్ల తర్వాత భారత జట్టు అక్కడ విజయ ఢంకా మోగించింది. ఐదు టెస్టుల సిరీసులో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆఖరిదైన మాంచెస్టర్‌ టెస్టులో కోహ్లీసేన ఓడిపోకపోతే.. ఆంగ్లేయులపై సిరీసు సొంతమవుతుంది. కాగా ఓవల్‌ విజయం తర్వాత టీమ్‌ఇండియాపై ప్రశంసల జల్లు కురిసింది.

ఇందులో భాగంగానే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ భారత జట్టును అభినందించాడు. ‘అద్భుత ప్రదర్శన.. రెండు జట్ల మధ్య నైపుణ్యమే తేడా. అంతకు మించిన తేడా ఏంటంటే టన్నుల కొద్దీ ఒత్తిడిని అధిగమించడం.. మిగతా వాళ్లతో పోలిస్తే భారత క్రికెట్‌ మరెంతో ముందుంది’ అని దాదా ట్వీట్‌ చేశాడు. దానికి వాన్‌ కవ్విస్తున్నట్టుగా బదులిచ్చాడు. ‘టెస్టు క్రికెట్లో మాత్రమే.. పరిమిత ఓవర్ల క్రికెట్లోనైతే కాదు’ అని సమాధానం ఇచ్చాడు.

ఇంగ్లాండ్‌ పిచ్‌లపై టీమ్‌ఇండియా ఆడలేదని.. స్వింగ్‌ బౌలింగ్‌ను ఎదుర్కోలేక కుప్పకూలుతుందని మైకేల్‌ వాన్‌ గతంలో అన్నాడు. అలా జరిగినప్పటికీ భారత్‌ పుంజుకొని విజయాలు సాధించింది. దాంతో ఓవల్‌ టెస్టు గెలుపు తర్వాత కోహ్లీసేనను వాన్‌ ప్రశంసించక తప్పలేదు.

‘ఐదు రోజుల క్రికెట్‌ గొప్పదనమే ఇది.. టీమ్‌ఇండియా అన్నింటా బలంగా కనిపించింది. ఆట మధ్యలో విరాట్‌ కోహ్లీ తెలివైన నిర్ణయాలు తీసుకున్నాడని అనిపించింది. దాంతో జట్టు ఆధిపత్యం చలాయించింది. ఐదో రోజు ఉదయం ఎలా బౌలింగ్‌ చేయాలో అలాగే చేశారు. రివర్స్‌ స్వింగ్‌ను రాబట్టారు’ అని అతడు ట్వీటాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని