T20 World Cup: అదరగొట్టిన లంక బ్యాటర్లు.. తేలిపోయిన విండీస్‌ బౌలర్లు

టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌ ఆశలు అట్టడుగున ఉన్న వెస్టిండీస్‌కు టోర్నీలో ఆఖరి మ్యాచ్‌ ఆడుతున్న శ్రీలంక భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు...

Updated : 04 Nov 2021 21:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌ ఆశలు అట్టడుగున ఉన్న వెస్టిండీస్‌కు టోర్నీలో ఆఖరి మ్యాచ్‌ ఆడుతున్న శ్రీలంక భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. దీంతో విండీస్‌కు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చరిత్‌ అసలంక (68:8 ఫోర్లు, ఒక సిక్స్), నిస్సాంక (51: ఐదు ఫోర్లు) అర్ధశతకాలు సాధించారు. కుశాల్‌ పెరీరా (29: రెండు ఫోర్లు, ఒక సిక్స్‌), డాసెన్ శనక (25*: రెండు ఫోర్‌, ఒక సిక్స్‌) రాణించారు. ఓపెనర్లు నిస్సాంక, పెరీరా తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ధాటిగా ఆడిన పెరీరా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన అసలంకతో కలిసి నిస్సాంక చెలరేగిపోయాడు. వీరిద్దరూ కలిసి 91 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. నిస్సాంక ఔటైనా.. లంక పరుగుల వేగం మాత్రం తగ్గలేదు. చివర్లో శనక దూకుడుగా ఆడాడు. కీలకమైన మ్యాచ్‌లో లంకపై వెస్టిండీస్‌ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. విండీస్‌ బౌలర్లలో రస్సెల్‌ 2, బ్రావో ఒక వికెట్‌ తీశారు. రవిరాంపాల్‌ (3-0-31-0), జాసన్‌ హోల్డర్‌ (4-0-37-0), అకీల్‌ హుస్సేన్ (2-0-22-0) పెద్దగా ప్రభావం చూపలేదు. బ్రావో వికెట్‌ తీసినా (1/42) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. సెమీస్ అవకాశాలు లంక ఎలాగూ లేవు.. భారీ లక్ష్యాన్ని ఛేదిస్తే విండీస్‌కి ఛాన్స్‌లు సజీవంగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని