Tokyo Olympics: వినేశ్‌ ఆశలు ఆవిరి.. తృటిలో పతకం కోల్పోయిన దీపక్

ఒలింపిక్స్‌ మహిళల 53 కేజీల విభాగంలో భారత్‌కు కచ్చితంగా పతకం తెస్తుందని ఆశించిన వినేశ్‌ ఫొగాట్‌కు నిరాశే ఎదురైంది. తొలుత క్వార్టర్‌ ఫైనల్స్‌లో బెలారస్‌కు చెందిన వనెసా చేతిలో 9-3 తేడాతో వినేశ్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే...

Published : 05 Aug 2021 18:37 IST

టోక్యో: ఒలింపిక్స్‌ మహిళల 53 కేజీల విభాగంలో భారత్‌కు కచ్చితంగా పతకం తెస్తుందని ఆశించిన వినేశ్‌ ఫొగాట్‌కు నిరాశే ఎదురైంది. తొలుత క్వార్టర్‌ ఫైనల్స్‌లో బెలారస్‌కు చెందిన వనెసా చేతిలో 9-3 తేడాతో వినేశ్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయినా, ఆమెకు రెపిఛేజ్‌ పద్ధతిలో కాంస్య పోరులో తలపడే అవకాశం ఉండేది. అది కూడా వనెసా సెమీస్‌లో చైనాకు చెందిన కియాన్యు పాంగ్‌ను ఓడించి ఉంటే వినేశ్‌కు ఆ అరుదైన అవకాశం దక్కేది. దాంతో ఆమెకు కనీసం కాంస్యమైనా చేజిక్కే వీలుండేది. కానీ, సెమీ ఫైనల్స్‌లో వనెసా ఓటమిపాలవ్వడంతో భారత రెజ్లర్‌ ఆశలు ఆవిరయ్యాయి. అంతకుముందు ప్రిక్వార్టర్స్‌లో వినేశ్‌‌.. స్వీడన్‌కు చెందిన మ్యాట్‌సన్‌ సోఫియాను 7-1 తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే.

ఆఖరి క్షణాల్లో ఓడిన దీపక్‌..

మరోవైపు 86 కేజీల విభాగంలో దీపక్‌ పునియా సైతం తృటిలో కాంస్య పతకం చేజార్చుకున్నాడు. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అతడు.. సాన్‌ మారినోకు చెందిన మైల్స్‌ నజీమ్‌తో తలపడిన ఈ పోరులో ఆఖరి క్షణాల్లో ఓటమిపాలయ్యాడు. ఈ మ్యాచ్‌లో 2-1తో ఆధిక్యంలో కొనసాగిన దీపక్‌ మ్యాచ్‌ ముగుస్తున్న పది సెకన్ల ముందు టేక్‌డౌన్‌తో విఫలమయ్యాడు. కాగా, అంతకుముందు దీపక్‌ సెమీ ఫైనల్స్‌లో అమెరికన్‌ రెజ్లర్‌ డేవిడ్‌ మారిస్‌ టేలర్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు. కానీ, కాంస్య పోరులో విజేతగా నిలిచేలా కనిపించిన అతడు తృటిలో కాంస్యాన్ని కోల్పోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని