Tokyo Olympics: ఒలింపిక్స్‌లో అనుచిత ప్రవర్తన.. వినేశ్‌ ఫొగాట్‌పై వేటు!

టోక్యో ఒలింపిక్స్‌లో అనుచిత ప్రవర్తన కారణంగా భారత అగ్రశ్రేణి మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) తాత్కాలిక నిషేధం విధించింది...

Updated : 12 Aug 2021 12:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో అనుచిత ప్రవర్తన కారణంగా భారత అగ్రశ్రేణి మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) తాత్కాలిక నిషేధం విధించింది. ఒలింపిక్స్‌ జరిగేటప్పుడు క్రీడా గ్రామంలో అథ్లెట్లకు కేటాయించిన గదుల వద్ద తోటి రెజ్లర్లతో కలిసి ఆమె ఉండటానికి నిరాకరించిందని, అలాగే వారితో ప్రాక్టీస్‌ చేయలేదని, మరోవైపు ఒలింపిక్స్‌లోనూ భారత క్రీడాకారుల అధికారిక స్పాన్సర్‌ కిట్‌ను ధరించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి తిరిగొచ్చిన వినేశ్‌కు మంగళవారం డబ్ల్యూఎఫ్‌ఐ నోటీసులు జారీ చేసిందని సంబంధిత అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. ఈనెల 16 వరకు ఆమెకు గడువు ఇచ్చారని, అప్పటిలోపు తన వివరణ ఇవ్వాలని అందులో ఆదేశించినట్లు తెలిపారు. వినేశ్‌ సమాధానం నమ్మశక్యంగా లేకపోతే డబ్ల్యూఎఫ్‌ఐ దీర్ఘకాలం నిషేధం విధించే అవకాశం ఉందని స్పష్టంచేశారు.

అసలేం జరిగిందంటే.. ఒలింపిక్స్‌ ప్రారంభానికి ముందు క్రీడా గ్రామంలో అథ్లెట్లకు కేటాయించిన గదుల వద్ద వినేశ్‌.. తన తోటి రెజ్లర్లు సోనమ్‌ మాలిక్‌, అన్షు మాలిక్‌, సీమా బిస్లాతో ఒకే అంతస్తులో కలిసి ఉండడానికి నిరాకరించింది. ఆటలు మొదలవ్వడానికి ముందు తాను హంగేరీ నుంచి వచ్చానని, మిగతా వారంతా భారత్‌ నుంచి వచ్చారని, దాంతో వారి నుంచి తనకు కరోనా వైరస్‌ సోకుంతుందని వినేశ్‌ వాదించిందని తెలిసింది. ఈ క్రమంలోనే వారితో కలిసి ప్రాక్టీస్‌ కూడా చేయలేదని.. అలాగే రెజ్లింగ్‌లో పోటీపడేటప్పుడు స్పాన్సర్‌ కిట్లను కూడా ధరించలేదని అక్కడికి వెళ్లిన అధికారులు వివరించారు. కాగా, ఈ విషయంపై టోక్యోలో నెలకొన్న వివాదంతో ఇండియన్‌ ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ నుంచి తమకు నోటీసులు వచ్చాయని, అథ్లెట్లను అదుపులో పెట్టుకోలేరా అని తీవ్రంగా స్పందించారని సంబంధిత అధికారి మీడియాతో చెప్పారు. ఈ నేపథ్యంలోనే వినేశ్‌ను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఒలింపిక్స్‌లో మహిళ రెజ్లింగ్‌ పోటీల్లో వినేశ్‌ భారత్‌కు కచ్చితంగా ఏదో ఒక పతకం సాధిస్తుందని ఆశించినా ఆమె ఖాళీ చేతులతో తిరిగొచ్చింది. మహిళల 53 కేజీల విభాగంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె క్వార్టర్‌ ఫైనల్స్‌లో బెలారస్‌కు చెందిన వెనెసా చేతిలో ఓటమిపాలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని