Ravi shastri - Virat Kohli: గౌరవం, విశ్వాసమే మా అనుబంధానికి బలం!

పరస్పరం గౌరవం, విశ్వాసం వల్లే కోచ్‌ రవిశాస్త్రితో సాన్నిహిత్యం పెరిగిందని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఆ అనుబంధమే జట్టును ఏకం చేసిందని, ప్రతి ఒక్కరికీ ప్రత్యర్థిని ఓడించాలన్న కసి పెరిగిందని వివరించాడు...

Published : 02 Sep 2021 16:04 IST

లండన్‌: పరస్పరం గౌరవం, విశ్వాసం వల్లే కోచ్‌ రవిశాస్త్రితో సాన్నిహిత్యం పెరిగిందని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఆ అనుబంధమే జట్టును ఏకం చేసిందని, ప్రతి ఒక్కరిలో ప్రత్యర్థిని ఓడించాలన్న కసి పెరిగిందని వివరించాడు. తాజ్‌ హోటల్లో ‘ది ఛాంబర్స్‌’ ఆరంభోత్సవంలో జట్టుతో కలిసి కోహ్లీ పాల్గొన్నాడు.

‘గౌరవం, విశ్వాసం ఆధారంగానే మైదానంలో, బయటా రవిశాస్త్రితో అనుబంధం పెరిగింది. ఆయన మాతో పంచుకున్న దార్శనికత వల్లే మేమంతా ఒకే దిశలో నడుస్తున్నాం. అందుకే, టీమ్‌ఇండియా అత్యున్నత శిఖరం వైపు పయనిస్తోంది’ అని కోహ్లీ అన్నాడు.

‘ఎప్పటికీ అదే మా లక్ష్యం. మా జట్టుకున్న ప్రతిభాపాటవాల ఆశీర్వాదాలతో మేం దానిని సాధించాం. ప్రపంచంలో మేమెక్కడ ఆడినా అందరిపై గెలవాలనే పట్టుదలతో ఉంటాం. అందుకు ఎంతో గర్వపడుతుంటాం’ అని కోహ్లీ తెలిపాడు. అలాగే రవిశాస్త్రి రాసిన ‘స్టార్‌ గేజింగ్‌’ పుస్తకంపై విరాట్‌ స్పందించాడు.

‘ఇది రవిశాస్త్రి తొలి పుస్తకం. అతడు మరికొన్ని పుస్తకాలు రాస్తాడనే అనుకుంటున్నా. ఎందుకంటే పంచుకోవడానికి ఆయన వద్ద చాలా సమాచారం ఉంది’ అని కోహ్లీ వెల్లడించాడు. ఇదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న సిరీసుపై రవిశాస్త్రిని ప్రశ్నించగా.. చివరి రెండు టెస్టుల తర్వాత పరిస్థితులు ఉత్కంఠ భరితంగా మారాయని తెలిపాడు.

‘కెప్టెన్‌, కోచ్‌ ఒకే తరహాలో ఆలోచిస్తుంటే ఎంతో బాగుంటుంది. అంతేకాకుండా కుర్రాళ్లు సైతం మా దారినే అనుసరిస్తున్నారు. మెరుగైన క్రికెట్‌ ఆడి గెలవాలన్నదే మా లక్ష్యం. మేం గణాంకాలు పూరించేందుకు ఇక్కడికి రాలేదు. సానుకూలంగా ఆడి గెలిచేందుకు వచ్చాం. ఇదో రసవత్తరమైన సిరీసు. రాబోయే రెండు వారాలు కూడా ఉత్కంఠభరితంగానే ఉంటాయి’ అని శాస్త్రి తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని