Cheteshwar pujara: 968 రోజుల శతకం ఎదురు చూపులకు 9 పరుగుల దూరంలో పుజారా!

ఎన్నాళ్లైందో..! చెతేశ్వర్‌ పుజారా బ్యాటు నుంచి పరుగుల వరద చూసి! ఎన్నేళ్లైందో టీమ్‌ఇండియా నయావాల్‌ గోడలా నిలబడి సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడి..!

Updated : 28 Aug 2021 16:14 IST

ఎన్నాళ్లైందో..! చెతేశ్వర్‌ పుజారా బ్యాటు నుంచి పరుగుల వరద చూసి! ఎన్నేళ్లైందో టీమ్‌ఇండియా నయావాల్‌ గోడలా నిలబడి సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడి..! వందల కొద్దీ బంతులు తింటూ మూడంకెలా స్కోరు చేయకపోవడంతో చాన్నాళ్లుగా అభిమానులు విసిగిపోయారు. వారి ఎదురుచూపులు ఫలించే సందర్భం రానే వచ్చింది. అతడి శతక సంబరాలు చూసేందుకు మరెంతో సమయం లేదు!

పుజారా నిలబడితే ప్రత్యర్థి బౌలర్లు అటు శారీరకంగా ఇటు మానసికంగా అలసిపోయేవారు. అలాంటిది కొన్నేళ్లుగా అతడు మూడంకెలా స్కోరు సాధించనే లేదు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అతడు శతకానికి చేరువయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి 180 బంతుల్లో 15 బౌండరీల సాయంతో 91 పరుగులతో అజేయంగా నిలిచాడు. శనివారం మరో 9 పరుగులు చేస్తే శతకం పూర్తవుతుంది.

అదే జరిగితే 968 రోజుల తర్వాత పుజారా శతకం అందుకున్నట్టు అవుతుంది. చివరి సారిగా 2019, జనవరిలో అతడు సెంచరీ కొట్టాడు. సిడ్నీలో 193 పరుగుల ఇన్నింగ్స్‌తో సిరీస్‌ విజయం అందించాడు. ఆ తర్వాత అతడు 35 ఇన్నింగ్సులు ఆడినా శతకం మాత్రం చేయలేకపోయాడు. ఎంత శ్రమించినా.. సహనంతో ఆడినా.. బంతులు తిన్నా.. బ్యాటింగ్‌లో సాంకేతిక లోపాలతో ఔటయ్యేవాడు. మరి శనివారం మిగతా 9 పరుగులు చేయడమే కాకుండా.. ఈ రెండు రోజులు నిలబడి జట్టుకు మేలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కొసమెరుపు ఏంటంటే..! టీమ్‌ఇండియా సారథి విరాట్‌కోహ్లీ శతకం చేయక శనివారానికి 645 రోజులు. పిచ్‌ బ్యాటర్లకు సహకరిస్తుండటం.. కోహ్లీ సైతం ఆంగ్లేయ బౌలర్లను బాగా ఎదుర్కొంటుండటం.. అతడు నిలబడాల్సిన అవసరం ఉండటంతో శతకం చేసినా ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుందో చూడాలి!!

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని