IND vs SA : సిరీస్‌ విజయ సమీకరణం 8 వికెట్లు.. 111 పరుగులు

నిర్ణయాత్మకమైన ఆఖరి టెస్టు మ్యాచ్‌ రసవత్తరంగా...

Updated : 13 Jan 2022 22:13 IST

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 198/10
దక్షిణాఫ్రికా లక్ష్యం 212.. ప్రస్తుతం 101/2

ఇంటర్నెట్ డెస్క్‌: నిర్ణయాత్మకమైన ఆఖరి టెస్టు మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. అయితే విజయం సాధించే అవకాశాలు ఆతిథ్య జట్టువైపే ఉన్నట్లుగా కనబడుతోంది. భారత్‌ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 111 పరుగులు చేయాలి.. భారత్‌ ఎనిమిది వికెట్లను పడగొట్టాలి. మరోవైపు పీటర్సన్ (48 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లు ఎంత శ్రమించినా పీటర్సన్-ఎల్గర్‌ (30) జోడీ వికెట్‌ ఇవ్వకుండా అడ్డుపడ్డారు. ఎట్టకేలకు బుమ్రా బౌలింగ్‌లో డీన్‌ ఎల్గర్‌ (30) వికెట్‌ దొరకడంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరో ఓపెనర్ మార్‌క్రమ్‌ (16) విఫలమయ్యాడు. టీమ్‌ఇండియా బౌలర్లు షమీ, బుమ్రా చెరో వికెట్‌ తీశారు. రేపు తొలి సెషన్‌లో వికెట్లను తీసినదానిని బట్టి విజయం ఖరారవుతుంది.

ఒకే ఒక్కడు.. పంత్‌

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది. ఈ మాత్రం స్కోరు చేసిందంటే ప్రధాన కారణం రిషభ్‌ పంత్ (100*). అద్భుతమైన శతకం సాధించి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. పంత్ కాకుండా విరాట్ కోహ్లీ (29) కాస్త ఫర్వాలేదనిపించాడు. మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్ 4, రబాడ 3, ఎంగిడి 3 వికెట్లు పడగొట్టారు. 

స్కోరు వివరాలు:

తొలి ఇన్నింగ్స్‌: భారత్‌ 223/10.. దక్షిణాఫ్రికా 210/10 

రెండో ఇన్నింగ్స్‌: భారత్ 198/10.. దక్షిణాఫ్రికా 101/2 (29.4 ఓవర్లు)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని