Vinesh Phogat: ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించిన వినేశ్‌ ఫొగాట్‌

కామన్‌వెల్త్‌ 2022 స్వర్ణపతక విజేత, భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ చరిత్ర సృష్టించింది. ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌ తరఫున రెండు కాంస్య పతకాలు నెగ్గిన తొలి రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పింది.

Updated : 15 Sep 2022 01:31 IST

బెల్‌గ్రేడ్‌: కామన్‌వెల్త్‌ 2022 స్వర్ణపతక విజేత, భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ చరిత్ర సృష్టించింది. ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌ తరఫున రెండు కాంస్య పతకాలు నెగ్గిన తొలి రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పింది. బెల్‌గ్రేడ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ పోటీల్లో 53 కిలోల విభాగంలో తలపడ్డ వినేశ్‌ ఫొగాట్‌ స్వీడన్‌ రెజ్లర్‌ ఎమ్మా జొనాను 8-0 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 2019 కజఖిస్థాన్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో తొలిసారిగా 28 ఏళ్ల వినేశ్‌ కాంస్యం సాధించింది. దీంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌ తరఫున వినేశ్‌ రెండు పతకాలు సాధించి తన పేర కొత్త చరిత్ర రాసుకుంది. 

క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో మంగోలియా రెజ్లర్‌ ఖులాన్‌ బత్కుయాగ్‌ చేతిలో ఏ మాత్రం పోటీ ఇవ్వలేక 7-0 తేడాతో పరాజయం పాలైన వినేశ్‌.. కాంస్య పతక పోరులో అనూహ్యరీతిలో చెలరేగి గొప్ప విజయం సాధించింది. ఖులాన్‌ బత్కుయాగ్‌ ఫైనల్‌కు చేరుకోవడంతో వినేశ్‌ రెపిచేజ్‌ రౌండ్‌కు అర్హత సాధించింది. ఈ రౌండ్‌లో తొలుత కజఖ్‌స్థాన్‌ రెజ్లర్‌ జుల్డిజ్‌ ఎషిమోవాను 4-0తో ఓడించింది. అయితే తర్వాతి రౌండ్‌లో అజర్‌బైజన్‌ రెజ్లర్‌ లేలా గుర్బనోవా గాయం కారణంగా పాల్గొనకపోవడంతో వినేశ్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. దీంతో ఈ రౌండ్‌లో గొప్ప పోటీ ఇచ్చి విజయం సాధించింది. వినేశ్‌ కామన్‌వెల్త్‌ పోటీల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని