Ashwin: విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌ ఆడతాడని ముందే అనుకున్నా: అశ్విన్‌

ఇండోర్‌ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా (Team India) ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌ ముగిసిన అనంతరం తాను కోహ్లీతో మాట్లాడిన విషయాలను అశ్విన్ వెల్లడించాడు.

Updated : 16 Mar 2023 00:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) గత కొంత కాలంగా టెస్టుల్లో ఫామ్‌లేమితో భారీ స్కోర్లు చేయలేదు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టుల్లోనూ పెద్దగా పరుగులు చేయలేదు. నాలుగో టెస్టులో మాత్రం ఏకంగా 186 పరుగులు బాది సెంచరీ కరవు తీర్చుకున్నాడు. దాదాపు 1200 రోజుల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో మూడంకెల స్కోరును అందుకున్నాడు. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 22, రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులకే ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌ ముగిసిన అనంతరం తాను విరాట్ కోహ్లీతో మాట్లాడినట్లు వెటరన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) వెల్లడించాడు.

“ఇండోర్ టెస్ట్ ముగిసిన తర్వాత విరాట్, నేను సుదీర్ఘంగా  మాట్లాడుకున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ మా మధ్య ఇలాంటి చర్చ జరగలేదు. విరాట్‌ కోహ్లీ బాగా ఆడుతున్నాడని, కానీ, భారీ స్కోరు చేయలేకపోతున్నాడని నాకు వ్యక్తిగతంగా అనిపించింది. అతడు క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకుంటున్నాడు. 30, 40ల్లోకి వచ్చిన తర్వాత ఔటవుతున్నాడు. ఇలాంటప్పుడు ఆ ఆటగాడి భుజాలపైన చెయ్యి వేసి ‘నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. ఇంకొంచెం సేపు క్రీజులో ఉండేందుకు ప్రయత్నించు. చాలా పెద్ద స్కోరు చేస్తావు’ అని చెబితే ఆ మాటలు చాలా పెద్ద బూస్టర్‌గా పని చేస్తాయి. నా విషయంలో చాలాసార్లు ఇలా జరిగింది. ఈ సారి  కోహ్లీ విషయంలో నేను ఆ బాధ్యత తీసుకున్నా. విరాట్‌ త్వరలోనే భారీ స్కోరు చేస్తాడని ముందుగానే అనుకున్నా.. ఎందుకంటే అంతకుముందు వన్డే సిరీస్‌లో (శ్రీలంకపై) కూడా  కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు’’ అని అశ్విన్‌ చెప్పాడు. 

‘‘విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్‌ పుజారా మా టాప్ టెస్ట్ బ్యాట్స్‌మెన్ అని నాకు తెలుసు. ఒకరు డిఫెన్స్‌తో బౌలర్లను విసిగిస్తే మరొకరు షాట్స్ ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించగలరు. వారిద్దరూ ఆడుతుంటే నేను, రోహిత్ శర్మ పక్కన కూర్చొని రోజంతా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి’’ అని భారత వెటరన్‌ స్పిన్నర్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని