IND vs NZ: సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై కన్ను.. మైలురాళ్లకు చేరువగా భారత స్టార్‌ ఆటగాళ్లు

న్యూజిలాండ్‌తో (IND vs NZ) మూడో వన్డే ఆడేందుకు టీమ్‌ఇండియా (Team India) సిద్ధమైంది. క్లీన్‌స్వీప్‌ చేసేందుకు సమాయత్తమైంది. ఈ సందర్భంగా పలు రికార్డులపై భారత ఆటగాళ్లు గురి పెట్టారు.

Published : 24 Jan 2023 11:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే భారత్ 2-0తో కైవసం చేసుకొన్న విషయం తెలిసిందే. చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేయాలని టీమ్‌ఇండియా ఎదురు చూస్తోంది. తొలి వన్డేలో బ్యాటింగ్‌లో అదరగొట్టగా.. రెండో మ్యాచ్‌లో బౌలింగ్‌తో కివీస్‌ను భారత్‌ బెంబేలెత్తించింది. అయితే మూడో వన్డేలోనూ టీమ్‌ఇండియా విజయం సాధిస్తే మాత్రం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకొనేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు మూడో స్థానంలో ఉన్న భారత్‌.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే నంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరుతుంది. 

వారిద్దరికి అవకాశం ఉందా..?

రెండు వన్డేల్లోనూ ఫాస్ట్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు. దీంతో సిరీస్‌ ఫలితానికి సంబంధం లేని నామమాత్రమైన మ్యాచ్‌లోనైనా వీరిద్దరికి చోటు కల్పిస్తుందో లేదో వేచి చూడాలి. సిరాజ్‌, షమీలో ఒకరికి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అయితే షమీకి గత మ్యాచ్‌లో చేతివేలికి గాయమైనప్పటికీ అలాగే బౌలింగ్‌ చేశాడు. దీంతో అతడిని పక్కన పెట్టే అవకాశం ఉందని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేశారు. 

రోహిత్‌ 10 ఏళ్లు.. సచిన్‌ రికార్డుపై కోహ్లీ

భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతలను అందుకోనున్నారు. ఓపెనర్‌గా రోహిత్ 10 ఏళ్లను పూర్తి చేసుకొన్నాడు. అదే విధంగా వన్డేల్లో నంబర్‌ వన్‌ ర్యాంక్‌ జట్టును క్లీన్‌స్వీప్‌ చేసే అవకాశం భారత్‌కు వచ్చింది. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఓ రికార్డుపై కన్నేశాడు. ఇంతకీ అది క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ రికార్డు కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో అర్ధశతకం సాధిస్తే మాత్రం న్యూజిలాండ్‌పై ఎక్కువ హాఫ్‌ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా మారతాడు. ప్రస్తుతం విరాట్, సచిన్‌ పదమూడేసి అర్ధశతకాలతో ఉన్నారు. సెంచరీ సాధిస్తే మాత్రం కివీస్‌పై ఎక్కువ శతకాలు సాధించిన బ్యాటర్‌గానూ వీరేంద్ర సెహ్వాగ్‌ (6)తో సమంగా విరాట్ కోహ్లీ (5) నిలుస్తాడు. 

తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్‌ పాండ్య, వాషింగ్టన్ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్, సిరాజ్‌, ఉమ్రాన్ మాలిక్‌, చాహల్‌

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని