Virat Kohli: గంభీర్‌తో హగ్‌.. పాపం కొందరికి నచ్చలేదు: విరాట్ కోహ్లీ

ముంబయితో తలపడేందుకు బెంగళూరు సిద్ధమవుతోంది. ఓ కార్యక్రమంలో బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గతంలో గంభీర్‌తో జరిగిన వాగ్వాదం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించాడు.

Published : 11 Apr 2024 15:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బెంగళూరు జట్టులో అత్యంత నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli). ప్రస్తుతం ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్ కూడా అతడే. ఇవాళ ముంబయితో వాంఖడే స్టేడియం వేదికగా బెంగళూరు తలపడనుంది. ఈసందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గతంలో గౌతమ్ గంభీర్‌తో (Gautam Gambhir) వాగ్వాదం, ఆ తర్వాత కరచాలనంతోపాటు హగ్‌ చేసుకోవడం వంటి అంశాలపైనా స్పందించాడు. 

‘‘అభిమానుల్లో కొందరు నేను అలా ప్రవర్తించడంతో నిరుత్సాహానికి గురయ్యారు. నవీనుల్‌, గౌతమ్‌భాయ్‌ను నేను హగ్‌ చేసుకోవడం వారికి నచ్చలేదు. ఎందుకంటే వారి చర్చల్లో మసాలా లేకుండాపోయింది. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ సందర్భంగా నేను, నవీనుల్‌ హక్‌ సరదాగానే మాట్లాడుకున్నాం. ‘త్వరగా ఫినిష్ చేసేయ్‌’ అని అతడు అన్నాడు. నేను కూడా ‘చేసేద్దాం’ అని నవ్వుకున్నాం. మ్యాచ్‌ ముగిశాక హగ్‌ చేసుకున్నాం’’ అని విరాట్ గుర్తు చేసుకున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో కోహ్లీ - నవీనుల్‌ హక్ - గంభీర్ ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అదే ఎడిషన్‌ తర్వాత బెంగళూరు - లఖ్‌నవూ తలపడినప్పుడు ఇద్దరూ కరచాలనం చేసుకొని ఆ వివాదానికి ముగింపు పలికారు. ఈసారి కూడా ఎలాంటి వివాదం లేకుండా ఐపీఎల్‌ సాగుతోంది. 

కోహ్లీపైనే మొత్తం భారం: సిద్ధూ

‘‘ఈ ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఒంటరి యోధుడు. అయితే, అతడి వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే బెంగళూరు విజయం సాధించడానికి సరిపోదు. రాజస్థాన్‌ జట్టు మాదిరిగా ప్రతిఒక్కరూ భాగస్వామ్యం అందించాలి. ఆర్సీబీలోని బ్యాటర్లు, బౌలర్లు పుంజుకోవాల్సిన సమయమిదే. సచిన్‌, సునీల్ గావస్కర్ అయినా ఒంటరిగానే జట్టును గెలిపించలేదు. స్పిన్‌ బౌలింగ్‌లో బెంగళూరు బలహీనంగా ఉంది. గతంలో హసరంగ ఉండేవాడు. అతడిని తీసుకోలేదు. దీంతో జట్టు వేలం వ్యూహం ఏంటనేది ప్రశ్నగా మారింది. భారీ హిట్టర్లనే కాకుండా బౌలింగ్‌ విభాగంపైనా దృష్టిపెడితే బాగుండేది’’ అని భారత మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్‌ సిద్ధూ వ్యాఖ్యానించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని