T20 World Cup: బంతి స్వింగ్‌ కాకపోతే ఆ సీనియర్‌ బౌలర్‌కు కష్టాలే: వసీం అక్రమ్‌

ఆస్ట్రేలియా పిచ్‌లు ఫాస్ట్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. బంతి స్వింగ్‌ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. కానీ అక్కడా స్వింగ్‌ను రాబడితే మాత్రం తిరుగుండదు. టీమ్‌ఇండియా సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుతంగా స్వింగ్‌ చేస్తాడు. అయితే పాక్‌ మాజీ పేసర్‌ మాత్రం భువీకి కష్టాలు తప్పవని హెచ్చరించాడు.

Published : 14 Oct 2022 01:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రా లేని లోటు టీమ్‌ఇండియాకు స్పష్టంగా కనిపిస్తుందని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ వసీమ్‌ అక్రమ్‌ అభిప్రాయపడ్డాడు. అలాగే మరో సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని పేర్కొన్నాడు. భువీ నేతృత్వంలోని భారత్‌ ఫాస్ట్ బౌలింగ్‌ దళం ప్రపంచకప్‌ బరిలోకి దిగింది. హర్షల్ పటేల్, అర్ష్‌దీప్‌ తప్పకుండా మరింత బాధ్యతగా బౌలింగ్‌ చేయాల్సిన అవసరం ఉందని తెలిపాడు. యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ జట్టులో ఉంటే బాగుండేదని సూచించాడు. 

‘‘కొత్త బంతితో భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. అయితే అతడి పేస్‌తోనే సమస్య వచ్చే అవకాశం ఉంది. బంతి స్వింగ్‌ కాకపోతే చాలా ఇబ్బంది పడతాడు. గొప్ప బౌలర్‌ అనే మాటలో ఎలాంటి సందేహం లేదు. వికెట్‌కు ఇరువైపులా స్వింగ్‌ చేయగలడు. యార్కర్లను సంధిస్తాడు. అయితే ఆస్ట్రేలియా పిచ్‌లపై పేస్‌ చాలా కీలకం. యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకొంటే చాలా ఉపయోగం ఉండేది. ఎందుకంటే మాలిక్ చాలా చక్కగా పేస్‌ను రాబడతాడు. భారత జట్టు ఎంపికలో నేను భాగస్వామినైతే తప్పకుండా ఉమ్రాన్‌ను తీసుకొనేవాడిని’’ అని తెలిపాడు. 

పొట్టి ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్‌ గొప్పగా రాణిస్తున్నాడని అక్రమ్ ప్రశంసించాడు. ‘‘సూర్యకుమార్ చాలా ప్రమాదకరమైన ఆటగాడు. అతడు 360 డిగ్రీల ఆటగాడు. భారత టీ20 లీగ్‌లో కోల్‌కతా జట్టుకు ఆడే సమయంలో సూర్యను మొదటిసారి చూశా. దాదాపు రెండేళ్లపాటు అతడితో ప్రయాణించా. సూర్యకుమార్‌ను కోల్‌కతా విడిచిపెట్టడం నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పుడు అతడి వయసు 19-20 ఉంటుంది. ఇప్పుడు కూడా జట్టుతో ఉండుంటే కోల్‌కతాకు తప్పకుండా కెప్టెన్‌ అయ్యేవాడు. టీ20 ఫార్మాట్‌లో తిరుగులేని ఆటగాడు. నా ఫేవరేట్‌ ప్లేయర్లలో సూర్యకుమార్‌ ఉంటాడనడంలో సందేహం లేదు’’ అని అక్రమ్‌ స్పష్టం చేశాడు. ఆసీస్‌ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని