Dinesh Karthik: టీమ్‌ఇండియాకు టీ20 కప్పు అందించడమే నా లక్ష్యం: డీకే

రాబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు కప్పు అందించడమే తన పెద్ద లక్ష్యమని వెటరన్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 మెగా లీగ్‌లో బెంగళూరు...

Published : 17 Apr 2022 13:54 IST

విరాట్‌ కోహ్లీతో ఇంటర్వ్యూ చూడండి..

(Photo: Dinesh Karthik Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: రాబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు కప్పు అందించడమే తన పెద్ద లక్ష్యమని వెటరన్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 మెగా లీగ్‌లో బెంగళూరు తరఫున అదిరిపోయే ప్రదర్శన చేస్తోన్న అతడు గతరాత్రి దిల్లీతో తలపడిన మ్యాచ్‌లో మరోసారి రెచ్చిపోయాడు. 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన కార్తీక్‌ మ్యాచ్‌ అనంతరం విరాట్‌ కోహ్లీతో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన ప్రస్తుత, దీర్ఘకాల లక్ష్యాలను వెల్లడించాడు.

కోహ్లీ: డీకే చాలా బాగా ఆడావు. మున్ముందు కూడా ఇలాగే ఆడాలని నేను చెప్పలేను. ఎందుకంటే నువ్వు ఈ ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తావని నాకు తెలుసు. నిన్ను ఇలా చూడటం అద్భుతంగా ఉంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరును గెలిపించినందుకు నీకు ధన్యవాదాలు. 2013 నుంచీ ఇదే నీ అత్యుత్తమ ప్రదర్శన. ఇలా రాణించడానికి ఎలా సన్నద్ధమయ్యావ్‌?

డీకే: నాకు ఇప్పుడు స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలున్నాయి. స్వల్పకాలిక లక్ష్యమైతే బెంగళూరును గెలిపించడం. అయితే, నేను ఇలా రాణించడానికి కారణం సంజయ్‌ బంగర్‌. మెగా వేలంలో నన్ను ఫినిషర్‌ పాత్ర కోసం దక్కించుకున్నామని ఆయన చెప్పినప్పుడు నాకూ ఇదే కావాలనుకున్నా. అందుకు తగ్గట్టు సన్నద్ధమయ్యా. ఇక దీర్ఘకాలిక లక్ష్యమైతే టీమ్‌ఇండియాకు ప్రపంచకప్‌ అందించడం. ఈసారి జరిగే టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉండాలనుకుంటున్నా. అలాగే జట్టు విజయాలు సాధించాలని ఆశిస్తున్నా. టీమ్‌ఇండియా మెగా ట్రోఫీలు సాధించి చాలాకాలమైంది. నేను ఇప్పుడు దాన్ని సాధించి పెట్టాలనే కోరికతో ఉన్నా. అందుకోసం చాలా విషయాలపై దృష్టిసారించాలి.

‘ప్రతిరోజూ నేను ఒకటే లక్ష్యంతో ప్రాక్టీస్‌ చేస్తా. నాలో అత్యుత్తమ ఆటగాడు బయటకు వచ్చేందుకు నెట్స్‌ సెషన్స్‌లో నా కోచ్‌లు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. వారివల్లే ఇది సాధ్యమైంది. వయసు పెరిగేకొద్దీ ఆటగాళ్లు ఫిట్‌గా ఉండాలి. అందుకోసం నా శక్తిమేరా ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు బెంగళూరు తరఫున రాణిస్తుండటం సంతోషంగా ఉంది. ఈ జట్టుతో రెండోసారి ఆడుతున్నా. దాంతో ఇక్కడ ప్రత్యేకంగా నిలవానుకున్నా’ అని డీకే చెప్పుకొచ్చాడు. అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. డీకే ఫినిషర్‌గా ఇప్పుడు బెంగళూరుకు విజయాలు అందించడం చూసి మాజీ ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌ సంతోషిస్తుంటాడని చెప్పాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని