IND vs SA: కోహ్లీ.. కెప్టెన్‌ స్థాయికి ఎదగడం అద్భుతం : కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌

పదేళ్ల టెస్ట్ కెరీర్లో విరాట్‌ కోహ్లీ ఆటగాడిగా ఎంతో పరిణతి సాధించాడని హెడ్‌ కోచ్‌ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ కెప్టెన్‌ స్థాయికి ఎదగడం అద్భుతమని...

Published : 25 Dec 2021 14:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పదేళ్ల టెస్ట్ కెరీర్లో విరాట్‌ కోహ్లీ ఆటగాడిగా ఎంతో పరిణతి సాధించాడని హెడ్‌ కోచ్‌ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ కెప్టెన్‌ స్థాయికి ఎదగడం అద్భుతమని పేర్కొన్నాడు. ద్రవిడ్ ఇటీవల బీసీసీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి పలు విషయాలు వెల్లడించాడు. 
 
‘2011లో విరాట్ కోహ్లీ టెస్ట్‌ క్రికెట్లోకి అరంగేట్రం చేసే నాటికి.. నేను ఇంకా క్రికెట్లో కొనసాగుతూనే ఉన్నాను. అతడితో కలిసి కొన్ని మ్యాచులు కూడా ఆడాను. ఈ పదేళ్ల కాలంలో కోహ్లీ ఒక ఆటగాడిగా, పరిపూర్ణమైన వ్యక్తిగా ఎంతో పరిణతి సాధించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ కెప్టెన్ స్థాయికి ఎదగడం అద్భుతంగా అనిపిస్తోంది. ఆటలో పర్‌ఫెక్షన్‌ కోసం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. ఓ నాయకుడిగా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ విషయంలో చాలా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడు’ అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు 97 టెస్టులు ఆడిన కోహ్లీ 50.65 సగటుతో 7,801 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు, 27 అర్ధ శతకాలు ఉన్నాయి.

2011లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేశాడు. ద్రవిడ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే, రెండు ఇన్నింగ్స్‌ల్లో కూడా ద్రవిడ్‌తో కలిసి బ్యాటింగ్‌ చేయడం గమనార్హం. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 40, రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులు చేసిన ద్రవిడ్ ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

Read latest Sports News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని