IND vs PAK: భారత్ - పాక్‌ టెస్టు సిరీస్‌.. ఆతిథ్యం ఇచ్చే యోచనలో ఎంసీసీ!

భారత్ (india), పాకిస్థాన్‌ (pakistan) జట్ల మధ్య టెస్టు సిరీస్‌ను నిర్వహించాలంటే కేవలం ఆయా బోర్డులే కాకుండా కేంద్ర ప్రభుత్వాల స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

Published : 30 Dec 2022 01:05 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్ ‌- పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ ఎప్పుడు జరిగినా సరే అభిమానులతో మైదానం కిక్కిరిసిపోతుంది. మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతుంది.. అభిమానుల చప్పట్లు, ఈలలతో మారుమోగడం ఖాయం. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన భారత్‌ - పాక్‌ మ్యాచ్‌ సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 90వేల మంది ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించినట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి. అయితే 2007 తర్వాత ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు బంద్ అయిన సంగతి తెలిసిందే. తటస్థ వేదికల్లోనే తలపడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో మెల్‌బోర్న్‌ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. 

‘‘భారత్- పాక్‌ జట్ల మధ్య టెస్టు సిరీస్‌ కోసం వేదికను సిద్ధం చేయడంలో మాకు ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే ప్రపంచకప్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌ భారీగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకొంది. టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌, పాక్‌ మ్యాచ్‌ చూస్తున్నప్పుడు కలిగిన అనుభూతి ఇదివరకు ఎప్పుడూ నేను అనుభవించలేదు. ప్రతి బంతికీ అభిమానుల నుంచి వచ్చిన స్పందన అసాధారణమైనది’’ 

‘‘ఒకవేళ ఇరుజట్లకు మెల్‌బోర్న్‌ మైదానం ఆతిథ్యమిస్తే టెస్టు క్రికెట్‌కు ఇంకా ఆదరణ పెరుగుతుంది. అభిమానులతో స్టేడియం కళకళలాడుతుంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్‌తో చర్చించాం. బిజీ షెడ్యూల్‌ సవాలుగా మారుతోంది. ఇది సాధ్యపడేలా ఐసీసీపై ఆస్ట్రేలియా క్రికెట్‌ ఒత్తిడి చేస్తుందని భావిస్తున్నా. కొన్ని స్టేడియాలు చాలా వరకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అందుకే ప్రేక్షకులతో కిక్కిరిసిపోయే మైదానాల్లో మ్యాచ్‌లను చూస్తే వచ్చే కిక్కే వేరు’’ అని ఎంసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ స్టువర్ట్‌ ఫాక్స్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని