విలియమ్సన్‌ @1.. విరాట్‌ కోహ్లీ @ 4

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మళ్లీ ప్రపంచ నంబర్‌ వన్‌గా అవతరించాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం చేరుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ను వెనక్కి నెట్టాడు. మరోవైపు టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.......

Updated : 01 Jul 2021 02:57 IST

స్టీవ్‌స్మిత్‌ను వెనక్కి నెట్టేసిన కేన్‌

దుబాయ్‌: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మళ్లీ ప్రపంచ నంబర్‌ వన్‌గా అవతరించాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ను వెనక్కి నెట్టాడు. మరోవైపు టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో విలియమ్సన్‌ భారీ స్కోరు చేయలేదు. రెండో టెస్టు ఆడలేదు. దాంతో స్టీవ్‌స్మిత్‌ అతడిని వెనక్కి నెట్టి అగ్రస్థానం సాధించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో 49, 52*తో రాణించిన కేన్‌ 10 రేటింగ్‌ పాయింట్ల అంతరంతో స్మిత్‌ (891 రేటింగ్‌)ను ఇప్పుడు రెండో స్థానానికి పరిమితం చేశాడు. 

విరాట్‌ కోహ్లీ ఎప్పటిలాగే నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఆరో స్థానానికి చేరుకున్నాడు. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్‌ ఏడో ర్యాంకుకు పడిపోయాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ రెండో ఇన్నింగ్స్‌లో 47* పరుగులతో నిలిచిన రాస్‌టేలర్‌ 3 స్థానాలు మెరుగై 14వ ర్యాంకు సాధించాడు. డేవాన్‌ కాన్వే 18 స్థానాలు ఎగబాకి 42వ ర్యాంకులో ఉన్నాడు.

బౌలర్ల జాబితాలో కైల్‌ జేమీసన్‌ కెరీర్‌ బెస్ట్‌ 13వ ర్యాంకు దక్కించుకున్నాడు. ఫైనల్లో 5/31, 2/30తో అతడు తిరుగులేని గణాంకాలు నమోదు చేశాడు. 1900 నుంచి టెస్టుల్లో అతడిలాంటి సగటు మరెవ్వరికీ లేకపోవడం ప్రత్యేకం. 2/48, 3/39తో రాణించిన ట్రెంట్‌బౌల్ట్‌ 2 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకు సాధించాడు.

ఇక ఫైనల్లో 49, 15 పరుగులతో ఫర్వాలేదనిపించిన అజింక్య రహానె 3 స్థానాలు మెరుగై 13వ ర్యాంకు అందుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకు వారం రోజుల మురిపెంగా మారింది. అతడు మళ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. బౌలర్ల జాబితాలో టాప్‌-10లో భారత్‌ నుంచి ఒకే ఒక్క బౌలర్‌ ఉన్నాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో అతడు మూడో స్థానంలో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని