AUS vs IND WTC Final: జూలు విదల్చాలి.. గద పట్టాలి!
జూన్ 7వ తేదీ నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final) మ్యాచ్ జరగనుంది. రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లిన టీమ్‌ఇండియా.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆసీస్‌ను అడ్డుకోవడంలో వీరిదే కీలక పాత్ర అవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: గత నెల చివరి వరకు ఐపీఎల్ (IPL 2023) మజాను అనుభవించిన క్రికెట్ ప్రియులకు వచ్చే వారం మరో పసందైన ఫెస్ట్ కనువిందు చేయనుంది. కానీ, ఐదు రోజులు మాత్రమే జరిగే టెస్టు పండుగపై అభిమానుల్లో ఆసక్తి నెలకొనడానికి కారణం అది డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final 2023) కావడం విశేషం. ఇంగ్లాండ్‌లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 12వ తేదీ వరకు ఆస్ట్రేలియా - భారత్ జట్ల (AUS vs IND) మధ్య ఫైనల్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుకు ఛాంపియన్‌షిప్ గదతోపాటు ప్రైజ్‌మనీ దక్కనుంది. ఆసీస్‌పై బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో దక్కించుకున్న టీమ్‌ఇండియా.. మరోసారి అదే ఆధిపత్యం ప్రదర్శించాలి.
పుజారా గురువు అవతారం ఎత్తాలి
దాదాపు రెండు నెలలపాటు టీమ్‌ఇండియాలోని మెజారిటీ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడారు. టీ20 క్రికెట్‌కు అలవాటు పడిన వారికి టెస్టుఫార్మాట్‌లోకి వచ్చేందుకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. ఇలాంటప్పుడే సీనియర్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా అక్కరకొస్తాడు. కౌంటీ క్రికెట్ ఆడిన పుజారా ఇంగ్లాండ్‌లోని పరిస్థితులకు భారత ఆటగాళ్లను త్వరగా కుదురుకునేలా తర్ఫీదు ఇవ్వాలి. ఐపీఎల్ చివరి దశలో ఉన్నప్పుడే కొంతమంది ఆటగాళ్లు ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టారు. ఓవల్ పిచ్ కూడా ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆసీస్ పేస్‌దళం ముందు భారత బ్యాటింగ్ విభాగం ఏమాత్రం నిలవగలదో వేచి చూడాలి.
కోహ్లీనే కీలకం (Virat Kohli)
విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారాకు ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. పుజారా కౌంటీ క్రికెట్ ఆడి వచ్చాడు. విరాట్ మాత్రం నేరుగా ఐపీఎల్‌లో తర్వాత ఇంగ్లాండ్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం విరాట్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడనంలో సందేహం లేదు. ఐపీఎల్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. బోర్డర్ - గావస్కర్ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో విరాట్ భారీ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఆసీస్‌పై 24 టెస్టులు ఆడిన విరాట్ 1,979 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక పుజారా కూడా 24 టెస్టుల్లో 2, 033 పరుగులతో ఆడుతున్నాడు. టాప్ ఆర్డర్‌లో వీరిద్దరూ రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. సూపర్ ఫామ్‌తో ఐపీఎల్‌లో అదరగొట్టిన గిల్ సుదీర్ఘఫార్మాట్‌లోనూ తన సత్తాను మళ్లీ చాటిచెప్పాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కెప్టెన్ రోహిత్‌తో కలిసి శుభారంభం అందించాలి.
రహానె వచ్చేశాడు..
ఐపీఎల్‌లో సంచలన ఆటతీరుతో వార్తల్లో నిలిచిన అజింక్య రహానె దాదాపు ఏడాదిన్నర తర్వాత భారత టెస్టు జట్టులోకి అడుగు పెట్టాడు. తానేంటో నిరూపించుకోవడానికి ఆకలిగొన్న పులిలా చెలరేగుతాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ వంటి మిడిలార్డర్ బ్యాటర్ల లేని లోటును రహానె తీర్చాల్సి ఉంది. ఒకవేళ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగితే టాప్ ఆర్డర్‌ను సమన్వయం చేసుకుంటూ లోయర్ ఆర్డర్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్‌లు ఆడాలి. వికెట్ కీపర్‌గా ఇషాన్ కంటే భరత్‌కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేఎల్ గాయపడటం అతడికి కలిసొస్తుంది. రోహిత్ తన ముంబయి సహచరుడికే అవకాశం ఇస్తాడేమో చూడాలి. లెఫ్ట్‌ఆర్మ్ బ్యాటర్ కావాలంటే మాత్రం ఇషాన్‌నే తీసుకోవాలి.
ఆల్‌రౌండర్లు ఎవరుంటారో..?
టీమ్‌ఇండియాలో ఈసారి ఆల్‌రౌండర్లకు కొదవేంలేదు. కానీ, ఇంగ్లాండ్ పిచ్‌లు పేస్‌కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి, పేస్ ఆల్‌రౌండర్ అయితే అన్ని విధాలా సరిపోతాడనేది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. శార్దూల్ ఠాకూర్ కూడా ఇలాంటి పేస్ ఆల్‌రౌండరే. మిగతా వారు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ కమ్ బ్యాటర్లు. తుది జట్టులో వీరిలో ఒకరికి మాత్రమే అవకాశం రావొచ్చు. లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్ వైపు మొగ్గు చూపితే జడేజా ఉండటం ఖాయం. ఆసీస్‌పై మరీ ముఖ్యంగా డబ్ల్యూటీసీ మ్యాచుల్లో మంచి రికార్డు ఉన్న అశ్విన్‌కైనా ఛాన్స్ ఇస్తుంది. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడం దాదాపు అసాధ్యమే.
షమీ పేస్ దళం ఇదే..
టీమ్‌ఇండియా పేసర్ అనగానే జస్ప్రీత్ బుమ్రా గుర్తుకొస్తాడు. కానీ, శస్త్రచికిత్స కారణంగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. దీంతో భారత పేస్ భారం షమీ, సిరాజ్‌పైనే ఉంది. ఓవల్ పిచ్ ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. దీంతో వారిద్దరితోపాటు థర్డ్ పేసర్‌ను తీసుకోవాలంటే మరో ముగ్గురు రేసులో ఉన్నారు. జయ్‌దేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్. వీరిలో శార్దూల్ మినహా ఇద్దరూ ఓన్లీ పేసర్లు. శార్దూల్ ఆల్‌రౌండర్. కాబట్టి అదనంగా బ్యాటర్‌గా ఉపయోగపడతాడని భావిస్తే శార్దూల్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. వైవిధ్యం కోసం అయితే లెప్ట్‌ఆర్మ్ పేసర్ జయ్‌దేవ్ వైపు మొగ్గు చూపినా ఆశ్చర్యపడక్కర్లేదు.
అన్ని విభాగాల్లోనూ ఆధిక్యం..
రెండోసారి టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు (2021-2023) దూసుకెళ్లిన టీమ్‌ఇండియా ఈసారైనా గదను సొంతం చేసుకోవాలంటే అన్ని విభాగాల్లోనూ రాణించాలి. మొదటి డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ చివరి వరకు పోరాడినా కీలక సమయంలో చేతులెత్తేయడంతో న్యూజిలాండ్ చేతిలో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇప్పుడు ఆసీస్‌ను ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదు. ఖవాజా, లబుషేన్, రెన్‌షా, స్టీవ్‌స్మిత్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ వంటి భారీ బ్యాటింగ్ లైనప్ ఆసీస్ సొంతం. ఏమాత్రం ఉదాసీనత ప్రదర్శిస్తే ఇబ్బందులు తప్పవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ajit Pawar: ఆ పదవిలో ఎంతకాలం ఉంటానో..! చర్చకు దారితీసిన అజిత్ పవార్ వ్యాఖ్యలు
-
KTR: త్వరలోనే మరో 40వేల డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ: కేటీఆర్
-
Jawan: ‘జవాన్’తో అరుదైన రికార్డు సృష్టించిన షారుక్.. ఒకే ఏడాదిలో రెండుసార్లు..
-
Whatsapp: ఈ ఫోన్లలో త్వరలో వాట్సప్ బంద్.. లిస్ట్ ఇదిగో..
-
Ukraine: ఒడెస్సా పోర్టులో రష్యా భారీ విధ్వంసం..!
-
RDX Movie Review: రివ్యూ: ఆర్డీఎక్స్.. మలయాళంలో రూ.80 కోట్లు వసూలు చేసిన మూవీ ఓటీటీలో వచ్చేసింది!