T20 League Qualifier 2: బాదేసిన బట్లర్‌.. రాజస్థాన్‌ చేతిలో బెంగళూరు చిత్తు

టీ20 లీగ్‌ చివరి అంకంలో మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. మేటి బ్యాట్స్‌మెన్‌కు, నాణ్యమైన బౌలర్లకు నెలవైన రెండు జట్ల మధ్య రెండో క్వాలిఫయర్‌ పోరు మరికాసేపట్లో ప్రారంభంకానుంది.

Updated : 27 May 2022 23:29 IST

అహ్మదాబాద్‌: క్వాలిఫయర్‌-1లో చతికిలపడిన రాజస్థాన్‌.. క్వాలిఫయర్‌-2లో సత్తా చాటింది. బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించింది. రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్ బట్లర్ (106*; 60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరోసారి శతకంతో చెలరేగాడు. యశస్వీ జైస్వాల్ (21), సంజూ శాంసన్ (23) ఫర్వాలేదనిపించారు. బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్ రెండు, హసరంగ ఒక వికెట్ పడగొట్టారు.  అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం జరిగే ఫైనల్‌లో గుజరాత్‌తో రాజస్థాన్‌ తలపడనుంది. 

ప్లే ఆఫ్స్‌లో శతకాలు బాదిన క్రికెటర్లు

1) మురళీ విజయ్ (113; 58 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లు)- 2012 క్వాలిఫయర్‌ 2

2) వీరేంద్ర సెహ్వాగ్ (122; 58 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్‌లు)- 2014 క్వాలిఫయర్‌ 2 

3) వృద్ధిమాన్‌ సాహా  (115; 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లు)- 2014 ఫైనల్‌

4) షేన్‌ వాట్సన్‌ (117; 57 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లు)-  2018 ఫైనల్‌

5)రజత్‌ పటిదార్‌ (112; 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు)- 2022 ఎలిమినేటర్‌ 

6) జోస్‌ బట్లర్ ‌(106*; 60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లు)- 2022 క్వాలిఫయర్‌ 2 


స్కోరు వేగం కాస్త నెమ్మదించిన రాజస్థాన్‌ లక్ష్యానికి చేరువైంది. హేజిల్‌వుడ్ వేసిన 13 ఓవర్‌లో 3 పరుగులు, మ్యాక్స్‌వెల్ వేసిన 14 ఓవర్‌లో 5 పరుగులు రాగా.. హర్షల్ పటేల్ వేసిన తర్వాతి ఓవర్‌లో నాలుగు పరుగులు వచ్చాయి. హసరంగ వేసిన 16 ఓవర్‌లో బట్లర్ రెండు సిక్సర్లు బాదాడు. 16 ఓవర్లకు రాజస్థాన్‌ 140/2 స్కోరుతో ఉంది. బట్లర్ (88), పడిక్కల్ (8) క్రీజులో ఉన్నారు. 


బెంగళూరు బౌలర్లకు రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ చుక్కలు చూపిస్తున్నాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. షాబాజ్‌ అహ్మద్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో బట్లర్ రెండు ఫోర్లు బాదాడు. ఇదే ఓవర్‌లో సంజూ శాంసన్‌ ఓ సిక్సర్‌ బాదగా.. హర్షల్ పటేల్ వేసిన 11వ ఓవర్‌లో మరో సిక్సర్‌ కొట్టాడు. హసరంగ వేసిన 12వ ఓవర్‌లో సంజూ పెవిలియన్ చేరాడు. 12 ఓవర్లకు రాజస్థాన్‌ 114/2 స్కోరుతో ఉంది. దేవదుత్ పడిక్కల్ (1), బట్లర్ (69) క్రీజులో ఉన్నారు. రాజస్థాన్‌ విజయానికి 48 బంతుల్లో 44 పరుగులు కావాలి. 


బట్లర్ హాఫ్‌ సెంచరీ

రాజస్థాన్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ ఫోర్లు, సిక్సర్లతో అలరిస్తున్నాడు. షాబాజ్‌ అహ్మద్‌ వేసిన ఐదో ఓవర్‌లో బట్లర్‌ వరుసగా రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌ బాదాడు. హర్షల్‌ పటేల్‌ వేసిన అతడు రెండు ఫోర్లు కొట్టాడు. హేజిల్‌వుడ్‌ వేసిన ఆరో ఓవర్‌లో తొలి బంతికి యశస్వీ జైస్వాల్ (21) విరాట్ కోహ్లీకి చిక్కాడు. 8 ఓవర్లకు బెంగళూరు 81/1 స్కోరుతో ఉంది. బట్లర్ (56), సంజూ శాంసన్ (4) క్రీజులో ఉన్నారు.   


దంచికొడుతున్న రాజస్థాన్‌ ఓపెనర్లు జైస్వాల్, బట్లర్‌

బెంగళూరు నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రాజస్థాన్ బరిలోకి దిగింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్‌ దూకుడుగా ఆడుతున్నారు. సిరాజ్‌ వేసిన తొలి ఓవర్‌లో జైస్వాల్‌ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌ బాదగా.. సిరాజ్ వేసిన మూడో ఓవర్‌లో బట్లర్‌ రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌ కొట్టాడు. దీంతో 4 ఓవర్లకు రాజస్థాన్‌ 42/0 స్కోరుతో నిలిచింది. బట్లర్‌ (24), జైస్వాల్ (18) క్రీజులో ఉన్నారు. 


రాణించిన రజత్‌ పటిదార్‌.. రాజస్థాన్‌ లక్ష్యం ఎంతంటే?

టీ20 లీగ్‌లో ఫైనల్‌కు చేరాంటే తప్పక గెలవాల్సిన క్వాలిఫయర్‌-2లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బెంగళూరు ఆటగాళ్లలో రజత్ పాటిదార్‌ (58; 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా.. డుప్లెసిస్‌ (25), మ్యాక్స్‌వెల్ (24) ఫర్వాలేదనిపించారు. రాజస్థాన్‌ బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ, మెకాయ్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్‌, ట్రెంట్ బౌల్ట్ చెరో వికెట్ తీశారు. 


బెంగళూరు బ్యాటర్లు వేగం పెంచుతున్నారు. అశ్విన్‌ వేసిన 12 ఓవర్‌లో 11 పరుగులు రాగా.. చాహల్ వేసిన తర్వాతి ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. బౌల్ట్ వేసిన 14 ఓవర్‌లో చివరి బంతికి మ్యాక్స్‌వెల్ (24) ఔటయ్యాడు. అతడు మెకాయ్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 15 ఓవర్లకు బెంగళూరు 123/3 స్కోరుతో ఉంది. రజత్‌ పాటిదార్‌ (52), మహిపాల్ లోమ్రార్‌ (2) క్రీజులో ఉన్నారు.  


నెమ్మదిగా ఆడుతున్న బెంగళూరు 

కీలకమైన క్వాలిఫయర్‌-2లో బెంగళూరు నెమ్మదిగా ఆడుతోంది. మెకాయ్‌ వేసిన ఏడో ఓవర్‌లో ఆరు పరుగులు రాగా.. అశ్విన్‌ వేసిన తర్వాతి ఓవర్‌లోనూ 6 పరుగులే వచ్చాయి. చాహల్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో రజత్‌ పాటిదార్‌ సిక్సర్ బాదాడు. 10 ఓవర్లకు బెంగళూరు 74/1 స్కోరుతో ఉంది. రజత్‌ పాటిదార్‌ (32), డుప్లెసిస్‌ (25) క్రీజులో ఉన్నారు. 


పవర్‌ ప్లే పూర్తి

బెంగళూరు బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన ఎనిమిది పరుగులు వచ్చాయి. బౌల్ట్‌ వేసిన ఐదో ఓవర్‌లో డుప్లెసిస్‌ రెండు ఫోర్లు కొట్టగా.. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన ఆరో ఓవర్‌లో రజత్‌ పాటిదార్‌ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. ఇదే ఓవర్‌లో ఐదో బంతికి పాటిదార్‌ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ని రియాన్‌ పరాగ్‌ అందుకోలేకపోయాడు. 6 ఓవర్లకు బెంగళూరు 46/1 స్కోరు ఉంది. డుప్లెసిస్ (17), రజత్‌ పాటిదార్‌ (14) క్రీజులో ఉన్నారు. 


బెంగళూరుకు బిగ్‌ షాక్‌..

రాజస్థాన్‌, బెంగళూరు మధ్య క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఆదిలోనే గట్టిషాక్‌ తగిలింది. విరాట్ కోహ్లీ (7) ఔటయ్యాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన రెండో ఓవర్‌లో ఐదో బంతికి వికెట్‌కీపర్ సంజూ శాంసన్‌కు చిక్కాడు. 2 ఓవర్లకు బెంగళూరు వికెట్‌ నష్టపోయి 13 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (2), రజత్‌ పాటిదార్‌ (0) క్రీజులో ఉన్నారు.  


టాస్ గెలిచిన రాజస్థాన్‌

టీ20 లీగ్‌ చివరి అంకంలో మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. మేటి బ్యాట్స్‌మెన్‌కు, నాణ్యమైన బౌలర్లకు నెలవైన రెండు జట్ల మధ్య రెండో క్వాలిఫయర్‌ పోరు మరికాసేపట్లో ప్రారంభంకానుంది. తొలి క్వాలిఫయర్‌లో పోరాడి ఓడిన రాజస్థాన్‌ ఎలిమినేటర్‌లో కష్టం మీద గట్టెక్కిన బెంగళూరు ఫైనల్‌ బెర్తు కోసం తలపడబోతున్నాయి. టాస్‌ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ తొలుత ఫీల్డింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఫస్ట్‌ బెంగళూరు బ్యాటింగ్‌ చేయనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టైటిల్‌ పోరులో గుజరాత్‌ను ఢీకొంటుంది. 

బెంగళూరు జట్టు:

విరాట్ కోహ్లీ, డుప్లెసిస్‌ (కెప్టెన్), రజత్‌ పాటిదార్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్‌ కార్తీక్, మహిపాల్‌ లోమ్రార్, షాబాజ్‌ అహ్మద్‌, వానిందు హసరంగ, హర్షల్‌ పటేల్, మహ్మద్‌ సిరాజ్‌, జోష్‌ హేజిల్‌వుడ్.

రాజస్థాన్‌ జట్టు: 

యశస్వీ జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌, దేవదుత్‌ పడిక్కల్, హెట్‌మయర్‌, రియాన్‌ పరాగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్ బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, యుజువేంద్ర చాహల్‌, ఒబ్డే మెకాయ్‌. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని