సుదూర అంతరిక్షంలో మరో భూమి!

భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్‌ ఎర్త్‌) గుర్తించారు.

Updated : 14 Feb 2024 06:52 IST

భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్‌ ఎర్త్‌) గుర్తించారు. దీని పేరు టీఓఐ-715 బీ. జీవుల మనుగడకు బాగా వీలు కల్పించగలదని భావిస్తున్న ఇది మన భూమి నుంచి 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీని వెడల్పు భూమి కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ. తన నక్షత్రం చుట్టూ 19 రోజులకు ఒకసారి తిరుగుతుంది. ఎర్రటి మరుగుజ్జు నక్షత్రాల కోవలోకి వచ్చే ఈ నక్షత్రం మన సూర్యుడి కన్నా చల్లగా ఉంటుంది. అందువల్ల నక్షత్రానికి సమీపంలోకి వచ్చినా నివాసయోగ్యంగా, భద్రంగానే ఉంటుంది. కాబట్టి టీఓఐ-715 బీ ఉపరితల ఉష్ణోగ్రత నీరు ద్రవ రూపంలో ఉండటానికి వీలు కల్పిస్తుంది. ఇది ప్రాణుల మనుగడకు అత్యంత అవసరం. ఆక్సిజన్‌ వంటి ఇతర పోషకాలూ దీని నుంచి లభిస్తాయి. అయితే తన నక్షత్రం నుంచి నివాసయోగ్య ప్రాంతంలో ఉన్నంతమాత్రాన అక్కడ కచ్చితంగా నీరు, జీవం ఉందని చెప్పలేం. ఇందులో గ్రహం ద్రవ్యరాశి, వాతావరణం వంటివీ కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు ద్రవ్యరాశి మితిమీరితే తీవ్ర గురుత్వాకర్షణ నీటిని అంతరిక్షంలోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటుంది. వాతావరణం లేకపోతే ఉపరితల పర్యావరణం కఠినంగా ఉంటుంది. ఇది నీటిని ద్రవరూపంలో ఉండనీయకుండా చేస్తుంది. ఒకవేళ గ్రహం అగ్నిపర్వతాలతో నిండి ఉన్నట్టయితే వాతావరణం విషతుల్యం అవుతుంది. ప్రాణులు పుట్టకుండా చేస్తుంది. అందుకే జేమ్స్‌ వెబ్‌ వెబ్‌ టెలిస్కోప్‌ సాయంతో టీఓఐ-715 బీని ఇంకాస్త లోతుగా అధ్యయనం చేయాలని నాసా సంకల్పించింది.

సూపర్‌ ఎర్త్‌ అంటే?

భూమి కన్నా పెద్దగా, నెప్ట్యూన్‌ కన్నా చిన్నగా ఉండే గ్రహాన్ని సూపర్‌ ఎర్త్‌గా భావిస్తారు. ఇలాంటివి నక్షత్ర మండలంలో తరచూ కనిపిస్తూనే ఉంటాయి. కానీ వాటి ప్రకృత్రి, వైవిధ్యాలు ఇంకా మనకు అంతగా అవగతం కాలేదు. కొన్ని సూపర్‌ ఎర్త్‌లు మన భూమి మాదిరిగా రాళ్లూ రప్పలు, పలుచటి వాతావరణంతో కూడి ఉండొచ్చు. మరికొన్ని నెప్ట్యూన్‌లాగా మందమైన వాతావరణంతో కూడిన సముద్రాలతో నిండి ఉండొచ్చు. కొన్నింటికి శని గ్రహం మాదిరిగా నక్షత్రాలు, వలయాలు ఉండొచ్చు. ద్రవ్యరాశి వంటివి సూపర్‌ ఎర్త్‌ల ఉపరితల గురుత్వాకర్షణ, ఉష్ణోగ్రతలను నిర్ణయిస్తాయి. ప్రాణుల మనుగడకు ఇవి కీలకం.

ఎలా గుర్తించారు?

సమీప నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలను శోధించటానికి 2018లో ప్రయోగించిన ట్రాన్సిటింగ్‌ ఎక్సోప్లానెట్‌ సర్వే శాటిలైట్‌ (టీఈఎస్‌ఎస్‌) టీఓఐ-715 బీని కనుగొంది. గ్రహాలు తమ నక్షత్రాలను దాటుకొని వెళ్తున్నప్పుడు అక్కడ కాంతి మసక బారుతుంది. దీని ఆధారంగానే భారీ భూమిని గుర్తించారు. టీఈఎస్‌ఎస్‌ అక్కడే ఈఓఐ-715 సీ అనే మరో గ్రహం జాడనూ పసిగట్టింది. ఇదీ మన భూమి కన్నా పెద్దదే. తన నక్షత్రాన్ని 10 రోజులకు ఒకసారి చుట్టివస్తుంది. అయితే దీని ఉనికి, స్వభావాలను నిర్ధరించటానికి మరింత సమాచారం అవసరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని