లిథియం బ్యాటరీ పేలకుండా..

ఇప్పుడు లిథియం-అయాన్‌ బ్యాటరీలు లేని డిజిటల్‌ పరికరాలను ఊహించుకోలేం. సెల్‌ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్‌వాచ్‌ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్‌, మ్యాక్‌, ఎలక్ట్రిక్‌ టూత్‌బ్రష్‌, ట్రిమ్మర్‌ వంటివీ వీటితోనే పనిచేస్తాయి.

Published : 24 Apr 2024 00:15 IST

ఇప్పుడు లిథియం-అయాన్‌ బ్యాటరీలు లేని డిజిటల్‌ పరికరాలను ఊహించుకోలేం. సెల్‌ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్‌వాచ్‌ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్‌, మ్యాక్‌, ఎలక్ట్రిక్‌ టూత్‌బ్రష్‌, ట్రిమ్మర్‌ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కార్ల వంటి వాటికీ ఇవే శక్తి వనరులు. లిథియం-అయాన్‌ బ్యాటరీల్లో మనం ఊహించిన దాని కన్నా ఎక్కువ శక్తి నిండి ఉంటుంది. అందుకే పరికరాలను వాడుతున్నకొద్దీ ఇవి వేడెక్కుతుంటాయి. మరీ వేడెక్కితే పరికరాలు కాలిపోవచ్చు. లిథియం- అయాన్‌ బ్యాటరీల్లో మండే స్వభావం గల పదార్థాలూ ఉంటాయి. వీటిల్లో జరిగే రసాయనిక ప్రతిచర్యల మూలంగా స్థిరత్వం కోల్పోవచ్చు. తమకు తామే వేడెక్కొచ్చు. పేలిపోవచ్చు. బ్యాటరీ మరీ వేెడెక్కటంతోనే కాదు.. విద్యుత్‌ సరఫరాలో షార్ట్‌ సర్క్యూట్‌, తయారీ లోపాల వంటివీ పేలిపోయేలా చేయొచ్చు. కాబట్టి జాగ్రత్త అవసరం.

డిజిటల్‌ పరికరాలకైతే..

  • ల్యాప్‌టాప్‌ను వేడిగా ఉన్న కారులో వదిలేయొద్దు. వేసవిలో ఇది మరింత ముఖ్యం. అలాగే ఎండ బాగా కాసే కిటికీ పక్కన గానీ పోర్టబుల్‌ హీటర్‌ వద్ద గానీ ఉంచొద్దు.
  • పరికరం మరీ వేడెక్కితే షట్‌ డౌన్‌ చేసి, కాసేపు విరామం ఇవ్వాలి. వీలైతే బ్యాటరీని బయటకు తీయాలి.
  • ల్యాప్‌టాప్‌ ఉష్ణోగ్రతను తెలిపే కోర్‌ టెంప్‌, రియల్‌ టెంప్‌ ఫర్‌ విండోస్‌ వంటి యాప్‌లనూ వాడుకోవచ్చు. ఇవి ఎప్పటికప్పుడు పరికరం వేడిని తెలియజేస్తాయి. ఉష్ణోగ్రత 176 డిగ్రీల ఫారన్‌హీట్‌ దాటిందంటే అప్రమత్తత అవసరం.
  • ఇంట్లో లిథియం-అయాన్‌ బ్యాటరీలతో కూడిన పాత ఫోన్లు, ఇతరత్రా పరికరాలున్నాయా? వాటిని అలాగే డ్రాయర్‌లో వదిలేయొద్దు. నిప్పు అంటుకోని బ్యాగులో పెట్టుకోవాలి.

ఇ-బైక్‌లకైతే..

  • ఇ-బైక్‌లను కొనటానికి ముందు బ్యాటరీ సేఫ్టీ సర్టిఫికెట్‌ను కలిగున్నాయో లేవో చూసుకోవాలి. ప్రమాణాలకు తగినట్టుగా లేకపోతే వేడెక్కే ప్రమాదముంది. షార్ట్‌ సర్క్యూట్‌కు గురయ్యే అవకాశమూ ఉంది.
  • ఇ-బైక్‌తో వచ్చే ఛార్జింగ్‌ కేబుల్‌ మాత్రమే వాడుకోవాలి. బ్యాటరీకి నేరుగా ఎండ తగలకుండా చూసుకోవాలి. ఇంటి లోపల గానీ గ్యారేజీ లోపల గానీ బైకును ఛార్జ్‌ చేయొద్దు.
  • రాత్రంతా ఇ-బైకు ఛార్జింగ్‌ వైరును ప్లగ్‌లో పెట్టి ఉంచొద్దు. ఇంట్లో లేనప్పుడూ ఇలాంటి పని చేయొద్దు.
  • బ్యాటరీ మరీ వేడెక్కినా, కాలుతున్న లేదా చిత్రమైన వాసన వస్తున్నా, విచిత్రమైన చప్పుడు చేస్తున్నా వెంటనే ఛార్జ్‌ చేయటం ఆపెయ్యాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని