మరో బొటనవేలు

బొటన వేలు గొప్పతనమేంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇది లేకపోతే దేన్నీ గట్టిగా పట్టుకోలేం. మహా భారతంలో ఏకలవ్యుడి కథ తెలుసుగా. ద్రోణాచార్యుడు తన శిష్యుడైన అర్జునుడికి పోటీ రావొచ్చనే భావనతో ఏకలవ్యుడి

Published : 12 Jun 2024 00:36 IST

బొటన వేలు గొప్పతనమేంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇది లేకపోతే దేన్నీ గట్టిగా పట్టుకోలేం. మహా భారతంలో ఏకలవ్యుడి కథ తెలుసుగా. ద్రోణాచార్యుడు తన శిష్యుడైన అర్జునుడికి పోటీ రావొచ్చనే భావనతో ఏకలవ్యుడి బొటనవేలును గురుదక్షిణగా ఇవ్వమని కోరతాడు. బొటనవేలు గొప్పతనం అలాంటిది. అలాంటి విశిష్టమైన బొటనవేలు మరోటి అదనంగా ఉంటే? త్వరలోనే ఇది చాలామంది చేతులకు దర్శనమిచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఇదేమీ పుట్టుకతో వచ్చే అవకరమేమీ కాదు. ఓ కృత్రిమ రోబో పరికరం. దీన్ని ముద్దుగా మూడో వేలనీ పిలుచుకుంటున్నారు. యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు దీన్ని రూపొందించారు. ఇటీవలే పరీక్షించారు కూడా. 

కృత్రిమ పరికరాలు అనగానే కోల్పోయిన అవయవాల స్థానంలో అమర్చేవే గుర్తుకొస్తాయి. కానీ ‘మూడో వేలు’ అలాంటిది కాదు. చేతికి చిటికెన వేలు వైపున అదనపు వేలుగా ఒదిగిపోతుంది. ఆ వైపున బొటన వేలుగా ఉపయోగపడుతుంది. వస్తువులను మరింత గట్టిగా పట్టుకోవటానికి తోడ్పడుతుంది. మామూలుగా కనిపించినా గొప్పదేనని భావిస్తున్నారు. 3డీ ముద్రణతో రూపొందించిన దీన్ని పాదాల వద్ద ఉండే వైర్‌లెస్‌ గ్రాహకాలతో నియంత్రించొచ్చు. కుడి పాదం పెద్ద వేలుతో గ్రాహకాల మీద పీడనాన్ని కలగజేస్తే రోబో వేలు చేతి మధ్యలోకి అడ్డంగా వస్తుంది. ఎడమ పాదం వేలుతోనైతే తెరచుకునేలా, పక్కలకు కదిలించేలా చేయొచ్చు. ఈ పీడనం సాయంతో వస్తువులను పట్టుకోవటం వంటి పనులు తేలికగా చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని వాడుకోవటానికి కొంత శిక్షణ అవసరం. ఇది సాధ్యమేనా అని పరీక్షించగా.. చాలామంది తేలికగా నేర్చుకున్నట్టు బయటపడటం గమనార్హం.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని