Baobab Tree: తల కిందుల చెట్టు పుట్టుక గుట్టు రట్టు

బావోబ్యాబ్‌ చెట్ల ఆకర్షణే వేరు. ‘తల కిందుల చెట్లు’ అని పేరొందిన ఇవి చూడగానే ఆకర్షిస్తాయి. వేలాది ఏళ్ల పాటు జీవించే ఇవి స్థానిక సంస్కృతి, సంప్రదాయాల్లోనూ భాగమమయ్యాయి

Published : 05 Jun 2024 03:42 IST

బావోబ్యాబ్‌ చెట్ల ఆకర్షణే వేరు. ‘తల కిందుల చెట్లు’ అని పేరొందిన ఇవి చూడగానే ఆకర్షిస్తాయి. వేలాది ఏళ్ల పాటు జీవించే ఇవి స్థానిక సంస్కృతి, సంప్రదాయాల్లోనూ భాగమమయ్యాయి. వీటి గురించి ఎన్నెన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ ఈ చెట్ల జన్మ స్థానం ఇప్పటికే రహస్యమే. దీనికి సంబంధించి ఇటీవల ఓ కొత్త విషయం బయటపడింది.

బావోబ్యాబ్‌ చెట్లు అడన్‌సోనియా జాతికి చెందిన వృక్షాలు. ఆఫ్రికా, అరేబియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్‌లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి ఆయా ప్రాంతాల్లో ఎలా పెరుగుతాయోనని శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా చర్చిస్తూనే వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 8 జాతుల బావోబ్యాబ్‌ వృక్షాలు కనిపిస్తుంటాయి. అయితే వీటి విస్తరణ అసాధారణం. ఒక జాతి వృక్షాలు ఆఫ్రికాలో కనిపిస్తే.. ఆరు జాతులు మడగాస్కర్‌లో విస్తరించి ఉన్నాయి. మరొక జాతి వృక్షాలేమో సుదూర ఆస్ట్రేలియాలో పెరుగుతుంటాయి. ఇవి ఆఫ్రికాలో పుట్టాయని చాలామంది పరిశోధకుల భావన. కానీ ఇటీవల నేచర్‌ ప్రతికలో ప్రచురితమైన అధ్యయనం విభిన్నమైన కథను వివరించింది. బావోబ్యాబ్‌ వృక్షాలు తొలిసారి మడగాస్కర్‌లో పరిణామం చెంది ఉండొచ్చని, అక్కడ రెండు భిన్న జాతులుగా మారి ఉండొచ్చని పేర్కొంది. అక్కడి నుంచి సముద్ర ప్రయాణంతో సుదూర ఖండాలకు విస్తరించాయని వివరించింది. ‘మడగాస్కర్‌ అద్భుతమైన సహజ ప్రయోగశాల’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన చైనాలోని వుహాన్‌ బొటానికల్‌ గార్డెన్‌ వృక్ష శాస్త్రవేత్త టావో వాన్‌ అభివర్ణిస్తున్నారు. అక్కడి ప్రత్యేకమైన భౌగోళిక చరిత్ర బావోబ్యాబ్‌ జాతుల వైవిధ్యానికి దోహదం చేసిందని చెబుతున్నారు. వాన్, ఆయన బృందం మొత్తం 8 జాతుల జన్యుచట్రాన్ని విశ్లేషించి, దీని ఆధారంగా అవి ఎలా పరిణామం చెందాయో పరిశీలించారు. చివరికి వీటి ఉమ్మడి పూర్వ వృక్షం మడగాస్కర్‌లో 2.1 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టిందని తేల్చారు. ఇతర వృక్షాలతో పోటీ పడటంతో పాటు భౌగోళిక ఎత్తు, ఉష్ణోగ్రత, అవక్షేపణం, అగ్ని పర్వాతల పేలుళ్ల వంటివి అక్కడ కొత్త జాతులు పుట్టుకురావటానికి ఆస్కారం కలిగించాయి. 

ఎలా విస్తరించాయి? 

ఏ వృక్షమైనా విస్తరించటానికి, వాటి పుప్పొడిని వ్యాపింపజేసే జీవులు అవసరం. బావోబ్యాబ్‌ విషయంలో కోతిలా కనిపించే లెమ్యూర్‌ జంతువులు ఈ పనిని చేసి పెట్టాయి. పండ్లు తినే గబ్బిలాలు, ఆఫ్రికాలోని గాలగో జంతువులు రాత్రిపూట వీటి మకరందానికి అలవాటు పడటమూ వ్యాపికి దోహదం చేసింది. బావోబ్యాబ్‌ వృక్షాలు తమ పరిణామక్రమంలో పెద్ద, చక్కెర తినే జంతువులను వాడుకోవటం విచిత్రం. చెట్లు, మొక్కల విషయంలో ఇది అసాధారణమైన విషయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు 1.2 కోట్ల సంవత్సరాల క్రితం రెండు మలగసే బావోబ్యాబ్‌ జాతులు ఆఫ్రికా, ఆస్ట్రేలియాకు చేరుకున్నాయి. అక్కడవి ప్రత్యేకంగా చెట్లుగా రూపాంతరం చెంది, ప్రస్తుతం కనిపిస్తున్న విధంగా ఎదిగాయి. హిందూ మహా సముద్రం అలల ప్రవాహం ద్వారా చెట్లు, మొక్కలతో కలిసి బావోబ్యాబ్‌ విత్తనాలు వ్యాపించి ఉండొచ్చని భావిస్తున్నారు. హిందూ మహా సముద్రం అల ప్రవాహాం అపసవ్యదిశలో ఆస్ట్రేలియా, దక్షిణాసియా, ఆఫ్రికా తూర్పు తీరాల మధ్య కదలటం విచిత్రం. దీని మూలంగానే బావోబ్యాబ్‌ విత్తనాలు సుదూర ఖండాలకు విస్తరించటం సాధ్యమైంది.

అంతరించే ప్రమాదం

రెండు మలగసే బావోబ్యాబ్‌ జాతులు అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్టు తేలటం ఆందోళనకరం. వీటిలో జన్యు వైవిధ్యం తక్కువగా ఉండటం వల్ల వాతావరణ మార్పును తట్టుకొని, దానికి అనుగుణంగా మారటం కష్టమని భావిస్తున్నారు. విస్తృతంగా వ్యాపించిన ఒక జాతితో సంపర్కం చెందటం మూలంగా మూడో జాతి మనుగడ కూడా ప్రమాదంలో పడిందంటున్నారు. వీటిని ఇప్పటికే ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ రెడ్‌ లిస్టులో చేర్చారు. అంతరించే దశలో ఉన్న జాతులను ఇందులో జోడిస్తుంటారు. తాజాగా వెలువడిన జన్యు సమాచారంతో ఈ ప్రమాదం మరింత పెరిగినట్టయ్యింది. మడగాస్కర్‌లో గత 2,500 సంవత్సరాలుగా చాలా వృక్ష, జీవజాతులు అంతరిస్తున్నాయి. ఆరు మలగసే బావోబ్యాబ్‌ జాతులూ ఈ కోవలోనే ఉన్నాయి. దీనికి కారణం మనుషులే. పెద్ద లెమ్యూర్‌లలో కొన్ని గొరిల్లా సైజుకూ పెరుగుతాయి. ఇవి బావోబ్యాబ్‌ విత్తనాల వ్యాప్తికి ఎంతగానో దోహదం చేశాయని భావిస్తున్నారు. అయితే మనుషులు వేటాడటం వల్ల వీటిల్లో చాలా జాతులు సుమారు వెయ్యేళ్ల క్రితమే అంతరించటం విచారకరం. పరిణామక్రమంలో భాగంగా జీవజాతులు సహజంగా పుడుతుంటాయి, మరణిస్తుంటాయి. మనుషుల జోక్యంతో ఈ ప్రక్రియ మరింత తీవ్రమైపోయింది.

ట్రీ ఆఫ్‌ లైఫ్‌

బావోబ్యాబ్‌ వృక్షాలను సాహిత్యంలో ‘ద ట్రీ ఆఫ్‌ లైఫ్‌’ అని వర్ణిస్తారు. దీని బెరడు, పండ్లు 300 రకాలుగా ప్రాణం నిలవడటానికి తోడ్పడతాయి మరి. స్థానిక వైద్యం, సంప్రదాయాలు, జానపద జీవనంలోకి దీని మూలాలు చొచ్చుకెళ్లాయి. ఈ వృక్షాలు 5వేల ఏళ్ల వరకూ జీవిస్తాయని ఆఫ్రికా ఖండం అన్వేషణకు వెళ్లినవారు భావించారు. కానీ కార్బన్‌ డేటింగ్‌ ప్రక్రియతో పరీక్షించగా 3వేల ఏళ్లు జీవిస్తాయని తేలింది. భారీ కాండంతో కూడిన ఇవి 100 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. రకరకాల జీవులకు ఆవాసం కల్పిస్తాయి. ఆహారం, నీరు అందిస్తాయి. ఆఫ్రికాలో నివసించే సముదాయాలు ఈ చెట్ల చుట్టూరా తమ ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటుంటారు.

దేవతల కోపంతో తల కిందులు

బావోబ్యాబ్‌ కొమ్మలు పైన వేళ్ల మాదిరిగా అన్ని వైపులకూ విస్తరించినట్టు ఉంటాయి. అందుకే ఇది చూడటానికి తల కిందుల చెట్టుగా కనిపిస్తుంది. స్థానికులు దీని మీద ఆసక్తికరమైన కథనూ చెబుతుంటారు. బావోబ్యాబ్‌ చెట్టుకు పొగరు ఎక్కువట. అందువల్ల దేవతలు కోపం తెచ్చుకొని, వేళ్లతో పెకిలించి తల కిందులుగా భూమి మీదకు విసిరేశారట. అప్పటి నుంచీ ఈ చెట్లు తల కిందులుగా మొలవటం మొదలెట్టాయని స్థానిక సముదాయాలు కథలుగా చెప్పుకొంటాయి.

పర్యావరణానికి కీలకం

ఆఫ్రికాలోని సవానా ప్రాంత పొడి పర్యావరణ వ్యవస్థకు బావోబ్యాబ్‌ వృక్షాలే ఆధారం. ఇవి నేల తేమగా ఉండటానికి, పోషకాల పునర్యవస్థీకరణకు తోడ్పడతాయి. వీటి వేళ్లు బలంగా, ఎక్కువ దూరాలకు విస్తరించటం మూలంగా నేల కోతకు గురికాకుండానూ అడ్డుకుంటాయి. వీటి పూలు రాత్రిపూట పూస్తాయి. ఒక రోజులోనే రాలుతాయి. పొడి కాలంలో పోషకాలతో కూడిన పండ్లను అందిస్తాయి. ఈ పండ్లలో విటమిన్‌ సి దండిగా ఉంటుంది. చాలా జీవులకివి ఆహారాన్ని, కీలక పోషకాన్ని అందిస్తాయి. బావోబ్యాబ్‌ చెట్లు వర్షాకాలంలో నీటిని పీల్చుకొని కాండంలో నిల్వ చేసుకోవటం విశేషం. అందుకే బల్లులు, పక్షులు, కోతులు, చివరికి ఏనుగులు సైతం దీని మీద ఆధారపడుతుంటాయి. చుట్టుపక్కల నీరు కనిపించకపోతే వీటి బెరడును నములుతుంటాయి. ఆఫ్రికాలో కనిపించే బావోబ్యాబ్‌ చెట్ల తీరే వేరు. పరిమాణం, జీవితకాలం, పండ్లు, బెరడు విషయంలో ఇవి ప్రత్యేకం. అంతేకాదు.. బోలెడన్ని కొమ్మలు కలిసిపోతూ నిరంతరం ఎదుగుతూ వస్తాయి. బెరడు మూలంగా ఈ కొమ్మల మధ్య ఖాళీలు ఏర్పడతాయి. చివరికివి కలిసిపోయి పెద్దగా అవుతాయి.

జన జీవనంలో

బావోబ్యాబ్‌ పండ్ల గుజ్జును స్థానికులు తింటారు. నీటిలో నానబెట్టి పానీయంగానూ తాగుతారు. నిల్వ చేసుకొని జామ్‌గా ఉపయోగిస్తారు. వేయించి, పొడి చేసి కాఫీగానూ సేవిస్తారు. బెరడుతోనైతే తాళ్లు, చాపలు, బుట్టలు అల్లుతారు. కాగితం, వస్త్రాల తయారీకీ ఉపయోగిస్తారు. ఆకులను సైతం ఉడకబెట్టి, తింటారు. పూల పుప్పొడి నుంచి జిగురు తయారచేస్తారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని