పాలపుంత కేంద్రం తెలుసా?

మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్‌ కొత్త యాప్‌ సాయం తీసుకోవచ్చు. 

Published : 06 Mar 2024 01:24 IST

మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్‌ కొత్త యాప్‌ సాయం తీసుకోవచ్చు. దీని పేరు గాలాక్టిక్‌ కంపాస్‌. ఈ యాప్‌ మొబైల్‌ ఫోన్‌ను చిటికెలో ఖగోళ గైడ్‌గా మార్చేస్తుంది. సమతలంగా ఉన్నచోట దీన్ని పెడితే, అప్పుడది దిక్సూచిగా పనిచేస్తుందన్నమాట. యాప్‌ను ఓపెన్‌ చేయగానే తెర మీద ఆకుపచ్చ బాణం గుర్తు కనిపిస్తుంది. అంతరిక్షంలో భూమి ఎక్కడున్నా కూడా ఇది నిరంతరం నక్షత్ర మండల కేంద్రం వైపే చూస్తుంది. పాలపుంత కేంద్రం విచిత్రమైన ప్రాంతం. సాగిటేరియస్‌ ఏ అనే అత్యంత భారీ కృష్ణబిలం ఉండేది అక్కడే. భూమి నుంచి 26,670 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ఈ కృష్ణబిలం ద్రవ్యరాశి అంతా ఇంతా కాదు. సూర్యుడి కన్నా కోట్లాది రెట్ల ద్రవ్యరాశితో కూడుకొని ఉంటుంది. విశ్వం గుండా భూమి, సౌరవ్యవస్థ కదులుతూ ఉండటం వల్ల పాలపుంత కేంద్రం మారుతూ వస్తుంది. దీన్ని తేలికగా గుర్తించటం కోసమే ఈ యాప్‌ను రూపొందించారు. దీని ఇంటర్ఫేస్‌ తయారీకి ఛాట్‌జీపీటీ సాయం తీసుకోవటం గమనార్హం. ఒకో ప్రశ్ననూ సంధిస్తూ.. 3డీలో స్పేషియల్‌ దృక్కోణాలు, మలుపులకు అవసరమైన సంక్లిష్ట గణిత సూత్రాలను సమాకలనం చేస్తూ.. ఎక్స్‌కోడ్‌ ద్వారా ఛాట్‌జీపీటీ నుంచి కోడ్‌ను రన్‌ చేశారు. చివరికి యాప్‌ను రూపొందించారు. అయితే ఇది కేవలం పరీక్షకు ఉద్దేశించిందేనని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని