లాలీపాప్‌తో నోటి క్యాన్సర్‌ జాడ

క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం.

Published : 27 Mar 2024 00:06 IST

క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. సమయమూ ఎక్కువగానే పడుతుంది. మరి కోత పెట్టకుండానే క్యాన్సర్‌ను నిర్ధరిస్తే? అలాంటి ప్రత్యామ్నాయ వినూత్న పద్ధతిని రూపొందించటంలోనే నిమగ్నమయ్యారు బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీ పరిశోధకులు. రుచితో కూడిన లాలీపాప్‌లతోనే నోటి క్యాన్సర్‌ను నిర్ధరించటం దీని ప్రత్యేకత. ఈ లాలీపాప్‌లను స్మార్ట్‌ హైడ్రోజెల్‌తో తయారుచేస్తారు. ఇది సూక్ష్మ వల మాదిరిగా పనిచేస్తుంది. లాలీపాప్‌లను నోట్లో పెట్టుకొని చప్పరిస్తే లాలాజలం వాటిల్లోకి చేరుతుంది. దీంతో పాటు క్యాన్సర్‌ సూచికలైన ప్రొటీన్లు కూడా పోగవుతాయి. అనంతరం లాలీపాప్‌లను ప్రయోగశాలలో పగలకొట్టి, ప్రోటీన్లను సంగ్రహించి విశ్లేషిస్తారు. హైడ్రోజెల్‌ను ఘనాకారాల్లో మలచటానికి వీలుండటం వల్ల ప్రొటీన్లను, లాలాజలాన్ని పట్టుకోవటానికి ఎంతగానో ఉపయోగపడగలదని పరిశోధకులు భావిస్తున్నారు. కొన్నిసార్లు స్వరపేటిక క్యాన్సర్‌ నిర్ధరణ కోసం ముక్కు లేదా గొంతు నుంచి ఎండోస్కోప్‌ను ప్రవేశపెట్టి నమూనాలు తీయాల్సి ఉంటుంది. లాలీపాప్‌ల విధానం అందుబాటులోకి వస్తే ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయని ఆశిస్తున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని