నక్షత్రాలూ సంచరిస్తాయి!

నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు.

Published : 24 Apr 2024 00:13 IST

క్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. వీటినే ‘సంచార నక్షత్రాలు’ అంటారు. అంతర్‌ నక్షత్ర మండల తారలు, ధూర్త తారలనీ అంటారు. వీటిని తొలిసారిగా 1997లో గుర్తించారు. నక్షత్ర మండలాల సముదాయాల్లో సుమారు 15 నుంచి 50 శాతం వరకూ సంచార నక్షత్రాలు ఉండొచ్చని ఖగోళవేత్తల అంచనా. మన భూమి సమీపానికి వస్తే- పాలపుంత, ఆండ్రోమెడా నక్షత్ర మండలం మధ్య కనీసం 675 సంచార నక్షత్రాలు బయటపడ్డాయి. ఇవి ఎలా పుట్టుకొస్తాయన్నది ఇప్పటికీ రహస్యమే. అయితే వీటి పుట్టుకకు సంబంధించి కొన్ని ఊహా సిద్ధాంతాలు లేకపోలేదు. రెండు, అంతకన్నా ఎక్కువ నక్షత్ర మండలాలు ఢీకొన్నప్పుడు కొన్ని నక్షత్రాలు వాటి నుంచి బయటపడి.. నక్షత్ర మండలాల ఖాళీలోకి వచ్చి ఉండొచ్చని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇవి చాలా చిన్న నక్షత్ర మండలాల్లో ఏర్పడటం వల్ల వాటి గురుత్వాకర్షణను దాటుకొని రావటానికి ఆస్కారం ఏర్పడుతుండొచ్చని అనుకుంటున్నారు. భారీ నక్షత్ర మండలాలు ఢీకొన్నప్పుడు గురుత్వాకర్షణ అస్తవ్యస్తం కావటంతోనూ కొన్ని నక్షత్రాలు బయటకు వస్తుండొచ్చనేది మరికొందరి భావన. భారీ కృష్ణబిలంతో ఢీకొన్నప్పుడూ ఇవి నక్షత్ర మండలం ఆవలికి రావొచ్చనేదీ ఇంకో సిద్ధాంతం. ఏదేమైనా స్థిరంగా ఉంటాయని భావించే నక్షత్రాల్లోనూ కొన్ని దారి తప్పటమనేది విచిత్రమైన విషయమే కదూ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని