పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్‌

కృష్ణ పదార్థం (డార్క్‌ మ్యాటర్‌) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు.

Published : 28 Feb 2024 00:24 IST

కృష్ణ పదార్థం (డార్క్‌ మ్యాటర్‌) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. అయితే జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ (జేడబ్ల్యూఎస్‌టీ) తాజాగా గుర్తించిన నక్షత్ర మండలం ఈ భావనకు పెద్ద సవాలే విసురుతోంది. ఎందుకని?

అంతరిక్షంలో ఇప్పటివరకూ తెలియని నక్షత్ర మండలాల ఉనికిని గుర్తించటం కొత్తేమీ కాదు. కానీ తాజాగా గుర్తించిన నక్షత్ర మండలం (జడ్‌ఎఫ్‌- యూడీఎస్‌-7329) సాధారణమైంది కాదు. మొత్తం విశ్వం వయసు 1,380 కోట్ల ఏళ్లు. ఇందులో తొలి 80 కోట్ల ఏళ్లలోనే జడ్‌ఎఫ్‌-యూడీఎస్‌-7329 ఏర్పడింది. అయినా కూడా దీనిలో మన పాలపుంతలో కన్నా ఎక్కువ సంఖ్యలో నక్షత్రాలుండటం గమనార్హం. అంటే ఇవి కృష్ణ పదార్థం లేకుండానే ఏదో ఒక రకంగా ఏర్పడ్డాయని అర్థం. నక్షత్ర మండలాల ఏర్పాటును విశ్లేషించే స్టాండర్డ్‌ మోడల్‌కిది విరుద్ధం కావటమే ఆసక్తి కలిగిస్తోంది. తొలినాళ్ల నక్షత్ర మండలాలను పట్టి ఉంచటానికి భారీ కృష్ణ పదార్థాల నిర్మాణాలు అవసరమని ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ జడ్‌ఎఫ్‌-యూడీఎస్‌-7329 పుట్టే నాటికి విశ్వంలో అలాంటి నిర్మాణాలు ఏర్పడేంత సమయం లేదు. అయినా ఇదెలా ఏర్పడిందనేది అంతుచిక్కని ప్రశ్న.

 కాంతి వేగం సాయంతో

అంతరిక్షంలోని శూన్యంలో కాంతి స్థిరమైన వేగంతో ప్రయాణిస్తుంది. అందువల్ల విశ్వం లోలోతుల్లోకి వెళ్లే కొద్దీ మరింత సుదూర కాంతిని అడ్డుకోవచ్చు. ఇలా కాలంలో వెనక్కి వెళ్లి చూడటానికి అవకాశం లభిస్తుంది. దీని ఆధారంగానే శాస్త్రవేత్తలు జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ సాయంతో వందల కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్లి జడ్‌ఎఫ్‌-యూడీఎస్‌-7329ను గుర్తించారు. దీనిలోని నక్షత్రాల నుంచి వచ్చే కాంతి చట్రాన్ని అధ్యయనం చేసి, అవి సుమారు 1300 కోట్ల ఏళ్ల క్రితం పుట్టుకొచ్చాయని తేల్చారు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న నక్షత్ర మండలాలు ఏకీకృతం కావటానికి తోడ్పడిన మొట్టమొదటి నక్షత్ర గోళకాలు ఎప్పుడు ఏర్పడ్డాయనేది కచ్చితంగా తెలియదు. ఈ ప్రక్రియ బిగ్‌బ్యాంగ్‌ అనంతరం కొన్ని వేల కోట్ల ఏళ్ల తర్వాత నెమ్మదిగా మొదలయ్యిండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

చిత్రం కృష్ణ పదార్థం

కృష్ణ పదార్థం చిత్రమైంది. కంటికి కనిపించదు గానీ మన విశ్వం మొత్తంలో 25% వరకూ నిండి ఉండేది ఇదేనని భావిస్తుంటారు. దీని చుట్టూరా ఉండే పరివేషాలు వాయువుతో కలిసి తొలినాళ్లలో నక్షత్ర మండలాలకు బీజం వేశాయని అనుకుంటుంటారు. విశ్వం ఏర్పడిన తర్వాత 100 కోట్ల నుంచి 200 కోట్ల సంవత్సరాల తర్వాత తొలిదశ నక్షత్ర మండలాలు పరిపక్వ దశకు చేరుకున్నాయి. మొదట్లో మరుగుజ్జు నక్షత్ర మండలాలు ఏర్పడి.. అనంతరం అవి ఒకదాంతో మరోటి కలిసిపోయాయి. కానీ తాజాగా గుర్తించిన జడ్‌ఎఫ్‌- యూడీఎస్‌-7329 ఈ సిద్ధాంతానికి నిలవటం లేదు. కృష్ణ పదార్థం తగినంత లేకపోయినా నక్షత్ర మండలం ఏర్పడటమే కాకుండా బిగ్‌ బ్యాంగ్‌ అనంతరం అనతికాలంలోనే ఇది పుట్టుకు రావటం విచిత్రం.

అర్ధంతరంగానూ ఆగింది

తగినన్ని కృష్ణ పదార్థ నిర్మాణాలు లేకపోయినా పుట్టటం ఒక ఎత్తయితే.. ఈ నక్షత్ర మండలం హఠాత్తుగా మౌనం వహించటం మరో ఎత్తు. అంటే ఇందులో నక్షత్రాల పుట్టుక నిలిచిపోయిందన్నమాట. నక్షత్ర మండలాల పుట్టుక, పరిణామానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని ఇది సూచిస్తోంది. విశ్వం తొలినాళ్లలోనే ఇది అంత త్వరగా ఎలా ఏర్పడిందనేదీ పెద్ద ప్రశ్నగా మిగిలింది. మిగతా విశ్వంలో నక్షత్రాలు ఇంకా పుట్టుకొస్తున్నప్పుడు అక్కడ అర్ధంతరంగా ఈ పక్రియ ఎందుకు ఆగిపోయిందనేదీ రహస్యంగానే తోస్తోంది. ఇలాంటి నక్షత్ర మండలాలు మరెక్కడైనా ఉన్నాయేమో గుర్తించటం మీదా పరిశోధకులు దృష్టి సారించారు. ఒకవేళ అలాంటివి బయటపడితే నక్షత్ర మండలాల పుట్టుక మీద ప్రస్తుతం ఉన్న సిద్ధాంతాలకు ప్రమాదం వాటిల్లినట్టే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని