అణువు మందం బంగారు పొర

బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు.

Published : 24 Apr 2024 00:14 IST

బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే బంగారానికి ముద్దకట్టే స్వభావం ఉండటం వల్ల సాధ్యం కావటం లేదు. ఎట్టకేలకు స్వీడన్‌లోని లింకోపింగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు దీన్ని సాధించారు. జపాన్‌ స్వర్ణకారుల అతి పురాతన విధానం ఇందుకు తోడ్పడటం విశేషం. ఈ బంగారం పొరను గోల్డీన్‌ అని పిలుచుకుంటున్నారు. ఒక లోహాన్ని దన్నుగా ఉపయోగించి పరిశోధకులు దీన్ని సృష్టించారు. అయితే ఇది యాదృచ్ఛికంగానే బయటపడటం గమనార్హం. టైటానియం, కార్బన్‌ పొరల మధ్య బంగారాన్ని జొప్పించి.. అత్యధిక ఉష్ణోగ్రతలకు గురిచేసినప్పుడు ఆధార లోహంలో సిలికాన్‌ పొరల స్థానాన్ని బంగారం ఆక్రమించటం విశేషం. ఇంతకీ బంగారాన్ని పలుచటి పొరగా మార్చటమెందుకని అనుకుంటున్నారా? ఏదైనా పదార్థాన్ని అతి పలుచటి పొరగా మలిస్తే అద్భుతాలు సాధ్యమవుతాయి. ఇందుకు గ్రాఫీన్‌ మంచి ఉదాహరణ. దీన్ని కార్లు, డిజిటల్‌ పరికరాలకు పూతగా పూస్తే దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది విద్యుత్తు, నిర్మాణ, ఆరోగ్య, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో బాగా ఉపయోగపడుతోంది. అలాగే బంగారం కూడా. ఇది లోహమే అయినప్పటికీ అతి పల్చటి పొర రూపంలో సెమీకండక్టర్‌గా మారుతుంది. బంగారాన్ని గోల్డీన్‌గా మార్చటం వల్ల దీనికి కొత్త గుణం వచ్చిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది మున్ముందు కార్బన్‌ డయాక్సైడ్‌ మార్పిడి, హైడ్రోజన్‌ ఉత్పత్తి, రసాయనాలకు అదనపు విలువలు జోడించటం, నీటి శుద్ధి, కమ్యూనికేషన్‌ వంటి వాటికి ఉపయోగపడగలదని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని