భూగర్భంలో నీరెంత?

భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు.

Published : 20 Mar 2024 00:16 IST

భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. లోలోతుల్లోని నీటి సమాచారాన్ని తెలుసుకునే దాకా వదలరు. ఆ వివరాలు తెలిస్తే ఔరా అనాల్సిందే.

కంటికి కనిపించదు గానీ భూగర్భంలోని నీటి పరిమాణం ఎక్కువే. భూమి మీదున్న మంచు చరియలు, హిమానీ నదాల కన్నా భూమి లోపలి నేల, రాతి పొరల్లో ఉండే నీరే ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. భూమి పైపొర అయిన క్రస్ట్‌లో సుమారు 4.39 కోట్ల క్యూబిక్‌ కిలోమీటర్ల నీరుందని పరిశోధకులు గుర్తించారు. భూమ్మీద మంచు, హిమానీ నదాలతో పోల్చి చూస్తే తేడా ఇట్టే అర్థమవుతుంది. అంటార్కిటికాలోని మంచులో సుమారు 2.7 కోట్ల క్యూబిక్‌ కిలోమీటర్లు, గ్రీన్‌ల్యాండ్‌లో సుమారు 30 లక్షల క్యూబిక్‌ కిలోమీటర్లు.. అంటార్కిటికా, గ్రీన్‌ల్యాండ్‌ ఆవలి హిమానీ నదాల్లో 1.58 లక్షల క్యూబిక్‌ కిలోమీటర్ల నీరుంది. మన గ్రహంలో అతి ఎక్కువ నీరు కలిగున్నవి మహా సముద్రాలే. వీటిల్లో సుమారు 130 కోట్ల క్యూబిక్‌ కిలోమీటర్ల నీరుంది. ఈ లెక్కల ప్రకారం మహా సముద్రాలను పక్కన పెడితే అత్యంత ఎక్కువ నీరు భూగర్భంలోనే దాగుందన్నమాట.

 అంతా మంచి నీరు కాదు

భూమి పైపొర మందం 30 నుంచి 50 కి.మీ. ఉంటుంది. ఇందులో పైపొరల్లో చాలావరకూ మంచి నీరే ఉంటుంది. ఇది తాగటానికి, వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. అదే భూమి లోతుల్లోకి పోయినకొద్దీ ఉప్పు నీరే కనిపిస్తుంది. ఇది అంతగా కదలదు. ఉపరితలానికి చేరుకోదు. మిగతా నీటితో కలవకుండా విడిగానే ఉండిపోతుంది. అంత లోతుల్లోకి వెళ్లటం కష్టమైన పని కావటం వల్ల దీని గురించి మనకు తెలిసింది తక్కువే. అయితే కోట్లాది ఏళ్లుగా అక్కడే ఉండటం వల్ల అది భూమి గతానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించ గలదని భావిస్తున్నారు. ఆ నీరు సూక్ష్మక్రిములకు ఆవాసం కల్పిస్తుండొచ్చనీ అనుకుంటున్నారు. భూమ్మీద ప్రాణి ఎలా పుట్టింది? ఉపరితలం కింద చాలా లోతుల్లో నీరు ఉండొచ్చని భావిస్తున్న ఇతర గ్రహాల్లో ప్రాణులు ఎలా ఏర్పడొచ్చు? అనే ప్రశ్నలకూ సమాధానాలు దొరకొచ్చని ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని