మాట్లాడే పరికరం!

మాటలను గుర్తించే స్పీచ్‌ రికగ్నిషన్‌ పరిజ్ఞానంలో ఐఐటీ గువహటి పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. నేరుగా స్వరపేటిక కంపన సంకేతాల నుంచి మాటలను సృష్టించే పద్ధతిని సృష్టించారు.

Published : 08 May 2024 00:25 IST

మాటలను గుర్తించే స్పీచ్‌ రికగ్నిషన్‌ పరిజ్ఞానంలో ఐఐటీ గువహటి పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. నేరుగా స్వరపేటిక కంపన సంకేతాల నుంచి మాటలను సృష్టించే పద్ధతిని సృష్టించారు. దీని పేరు ‘ఎల్‌ఓక్యూయూ’. అంటే లాటిన్‌లో ‘మాట్లాడటానికి’ అని అర్థం. దీనిలోని సెన్సర్లు గొంతు వెలుపలి నుంచే స్వరతంత్రుల కదలికలను పసిగట్టి, వాటి ఆధారంగా మాటలను సృష్టిస్తుండటం గమనార్హం. మాట్లాడటంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారికి, మాటలు పీలగా వచ్చేవారికి, ఆసుపత్రుల వంటి వాతావరణాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడగలదని భావిస్తున్నారు. మనం అలవోకగా తేలికగా మాట్లాడేస్తుంటాం గానీ దీని వెనక పెద్ద కథే నడుస్తుంది. ఊపిరితిత్తుల నుంచి శ్వాసనాళం ద్వారా గాలి ప్రవహించి, స్వర పేటికను కదిలించటంతో మాట ప్రక్రియ మొదలవుతుంది. స్వరపేటికలోని స్వరతంత్రుల కంపనాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని ఊపిరితిత్తులు, నోరు మధ్య గాలి ప్రవాహాన్ని పర్యవేక్షించే గ్లోటిస్‌ అనే భాగం నియంత్రిస్తుంది. ఇవన్నీ ఒక సమన్వయంతో పనిచేస్తుంటాయి. స్వరతంత్రుల మధ్య ఖాళీలను అవసరానికి అనుగుణంగా స్వరపేటిక సరిచేస్తూ శబ్దాలను పుట్టిస్తుంది. ఇవి స్వర మార్గం ద్వారా ప్రయాణిస్తూ తీవ్రత, స్థాయిని మార్చుకుంటూ మాటల రూపంలో బయటకు వస్తాయి. కొన్నిసార్లు స్వరతంత్రులు కంపించినా నాలుక, గొంతు కండరాల సమన్వయం లోపించటం వల్ల మాట ఉత్పత్తి కాకపోవచ్చు. ఇలాంటి కారణాలతో మాట్లాడటంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారికి ఎల్‌ఓక్యూయూ బాగా ఉపయోగపడగలదు. దీని ద్వారా ఉత్పత్తయిన మాట స్పష్టంగా ఉండటం వల్ల మైక్రోఫోన్ల వంటి సంప్రదాయ పరిజ్ఞానాలకు ప్రత్యామ్నాయం కాగలదనీ ఆశిస్తున్నారు. ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ పరికరం ఖరీదు రూ.2వేల లోపే ఉండటం గమనార్హం. పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తే ఇంకా చవకగా లభించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు