Ranjith Reddy: ఏపీ మంత్రి బొత్స కరెంటు బిల్లు కట్టలేదేమో..: ఎంపీ రంజిత్‌ రెడ్డి

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను తెరాస చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ఖండించారు..

Updated : 30 Apr 2022 09:09 IST

హైదరాబాద్‌: ‘‘హైదరాబాద్‌లో అసలు కరెంటే ఉండటం లేదు. నేను జనరేటర్‌ వేసుకొని అక్కడ ఉండి వచ్చాను. కేటీఆర్‌కు ఎవరో ఫోన్‌ చేసి చెప్పారు. కానీ నేను స్వయంగా అనుభవించి వచ్చా’’ అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను తెరాస చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ఖండించారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విద్యుత్ బిల్లు కట్టకపోయి ఉండొచ్చని.. అందుకే ఆయన ఇంటికి కరెంట్ కట్ చేసి ఉంటారని తెరాస ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రెండు రోజులు కాదు కదా.. రెండు నిమిషాలు కూడా కరెంట్ పోవడం లేదన్న విషయం అందరికీ తెలుసన్నారు. వైకాపా నేతలు, వారి కుటుంబాలు మొత్తం హైదరాబాద్‌లోనే ఉంటున్నారని, వాళ్లను అడిగితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. కేసీఆర్ పాలన బాగుందని.. తాము కేసీఆర్ అభిమానులమని వైకాపా ఎంపీలు తనతో పలు మార్లు చెప్పారని రంజిత్‌ రెడ్డి గుర్తు చేశారు. ఏపీ పథకాలు తెలంగాణలో అమలు చేస్తామనడం విడ్డూరంగా ఉందన్న రంజిత్ రెడ్డి.. తెలంగాణ పథకాలను దేశమంతటా అమలు చేస్తున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.

ఏపీ గురించి కేటీఆర్‌ వాస్తవాలే మాట్లాడారు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్‌లో విద్యుత్‌ కోతలతో జనరేటర్‌ వాడుతున్నామన్న ఏపీ మంత్రి  బొత్స సత్యనారాయణ మాటలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ గురించి మంత్రి కేటీఆర్‌ ఉన్న విషయం చెబితే ఎందుకంత అక్కసు అని ప్రశ్నించారు. ‘‘మంత్రి కేటీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ గురించి ఉన్న నిజమే చెప్పారు. ఏపీని అభివృద్ధి చేస్తే మేమేమైనా అడ్డుపడుతున్నామా? విజయవాడ నుంచి స్థిరాస్తి వ్యాపారులు హైదరాబాద్‌ వస్తున్నారు. తెరాస హయాంలో రోడ్లు బాగున్నాయని ప్రజలకు తెలుసు. ఏపీ మంత్రి బొత్స కుటుంబం కూడా హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఏపీలో రోడ్లు బాగు చేసుకోండి, మంచిగా పాలన చేయండి. అందరూ బాగుండాలనే మేం కోరుకుంటున్నాం’’ అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌లో జరిగిన క్రెడాయ్‌ సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో దుమారం రేగింది. ‘పక్క రాష్ట్రంలో కరెంట్‌, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పారు. అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని చెప్పారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు.. పక్క రాష్ట్రం వెళ్లి మీరే చూడండి. అక్కడికి వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారు. కొన్ని మాటలంటే కొంత మందికి నచ్చకపోవచ్చు కానీ.. అవి వాస్తవాలు’’ అని ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితిపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపాయి. దీనిపై ఏపీ మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి, అమర్‌నాథ్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు స్పందించారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై తాజాగా తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని