Published : 11 Nov 2020 04:19 IST

ఓడినా.. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

ఒంటి చేత్తో మహాకూటమిని నడిపించిన తేజస్వి
ఉద్ధండులకు దీటుగా పోరాడిన యువనేత

తేజస్వి యాదవ్‌.. ఈ యువ నేత పేరు ఇప్పుడు దేశంలో తెలియని వారు లేరు. మూడు పదుల వయసున్న తేజస్వి బిహార్‌ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. గత ఎన్నికల్లోనే రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించినా అప్పుడు తండ్రి లాలూ చురుగ్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన జైల్లో ఉండటంతో తేజస్వి అన్నీ తానే అయి నడిపించారు. మహాకూటమి గెలిచి ఉంటే 31 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టించేవారు. మహాకూటమి గెలవకున్నా ఆయన్ను మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా పిలవవచ్చు. ఎందుకంటే ప్రత్యర్థి కూటమిలో ఉన్నది ప్రధాని మోదీ, నీతీశ్‌, సుశీల్‌కుమార్‌ మోదీ, మాంఝీ లాంటి అతిరథ మహారథులు. ఇటు చూస్తే బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌, బలమైన పట్టులేని వామపక్షాలు. రాజకీయంగా ఎత్తులు వేయడంలో దిట్ట అయిన తండ్రి అందుబాటులో లేరు. సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ ఉన్నా ఆయనకు రాజకీయ చాతుర్యం అంతంతే. దీంతో తెరవెనక ఎత్తులు వేసి మంత్రాంగం నడపాలన్నా, తెరముందు ప్రత్యర్థులపై వాగ్దాటితో విరుచుకుపడి ప్రజలను ఆకట్టుకోవాలన్నా అన్నీ తేజస్వినే. ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడంతో ఈ యువనేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన సభలకు పోటెత్తారు. ప్రసంగాలకు కరతాళ ధ్వనులతో సభలు మార్మోగాయి.

మహాకూటమి ఏర్పాటు చేస్తున్న తొలినాళ్లలో తేజస్వి నాయకత్వాన్ని కాంగ్రెస్‌, ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలోని ఆర్‌ఎల్‌ఎస్‌పీ, జితన్‌రామ్‌ మాంఝీ నేతృత్వంలోని హెచ్‌ఏఎం అంగీకరించలేదు. సమష్టి నాయకత్వం ఉండాలని ఆ పార్టీలు పట్టుబట్టాయి. అయితే వారి డిమాండ్లకు తేజస్వి తలొగ్గలేదు. చివరకు కుశ్వాహా, మాంఝీ బయటకు వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్‌కు తేజస్వి నాయకత్వాన్ని అంగీకరించక తప్పలేదు. బిహార్‌ రాజకీయాల్లో చక్రం తిప్పే లాలూ అందుబాటులో లేకున్నా ఆర్జేడీ గణనీయమైన సంఖ్యలో స్థానాలు గెల్చుకుందంటే ప్రధాన కారణం తేజస్వినే. శాసనసభ సమరం మొత్తం ఆయన కేంద్రంగానే నడిచింది. ప్రత్యర్థులు విమర్శించడానికి ఆయన తప్ప మరో నేత కనిపించలేదు. మోదీ, నడ్డా, రాజ్‌నాథ్‌, యోగి, నీతీశ్‌ ఇలా ఎన్‌డీయే తరఫున ప్రచారానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తేజస్వి లక్ష్యంగానే విమర్శలు కురిపించారు. ఆయన పేరు లేకుండా ప్రసంగాన్ని పూర్తి చేయలేదు. వారందరికీ యువనేత దీటుగా బదులిచ్చారు. ఎన్‌డీఏ నేతలను ఇరుకున పెట్టే ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ ఉద్యోగాల హామీ సహా వివిధ హామీలతో యువతను ఆకట్టుకున్నారు. సొంత పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తూనే రాహుల్‌గాంధీతో కాంగ్రెస్‌ సభల్లోనూ పాల్గొన్నారు. కానీ కాంగ్రెస్‌ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదు. దీంతో తేజస్వి అన్నీ తానై పోరు సాగించాల్సి వచ్చింది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని