పోలీసులు మేకులు బిగిస్తే.. రైతులు పూల మొక్కలు నాటారు!

కొత్త సాగు చట్టాల రద్దుకు ఉద్యమిస్తున్న రైతులు దిల్లీ-ఉత్తర్‌ప్రదేశ్‌ సరిహద్దులోని గాజీపుర్‌ వద్ద శుక్రవారం రోడ్డు పక్కన పూల మొక్కలు నాటి పోలీసుల చర్యలకు ప్రతిస్పందించారు. పోలీసులు దిల్లీ

Updated : 06 Feb 2021 05:20 IST

నోయిడా: కొత్త సాగు చట్టాల రద్దుకు ఉద్యమిస్తున్న రైతులు దిల్లీ-ఉత్తర్‌ప్రదేశ్‌ సరిహద్దులోని గాజీపుర్‌ వద్ద శుక్రవారం రోడ్డు పక్కన పూల మొక్కలు నాటి పోలీసుల చర్యలకు ప్రతిస్పందించారు. పోలీసులు దిల్లీ సరిహద్దుల్లో దుర్భేద్య ఏర్పాట్లు చేసి రోడ్డుపై పెద్ద పెద్ద మేకులు బిగించిన సంగతి తెలిసిందే. రైతులు రాకుండా వారు మేకులు బిగిస్తే.. తాము వారి కోసం పూల మొక్కలు నాటడానికి నిర్ణయించినట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్‌ టికాయత్‌ తెలిపారు. ఈమేరకు బారికేడ్లకు సమీపంలో బంతిపూల మొక్కలను వరుసగా నాటారు. రోడ్డు వెంట పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపడుతున్నట్లు బీకేయూ మీడియా ఇన్‌ఛార్జి ధర్మేంద్ర మాలిక్‌ తెలిపారు. దిల్లీ-డాబర్‌ తిరాహా రహదారిని ఆనుకుని పూలతోటను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమీపంలోని నర్సరీల నుంచి రైతులు పూల మొక్కులు తెస్తున్నారు.
విదేశీ సెలబ్రిటీలు మద్దతిస్తే ఇబ్బందేమిటి..
రైతుల ఉద్యమానికి విదేశీ సెలబ్రిటీలు మద్దతిస్తే ఇబ్బందేమిటని బీకేయూ నేత రాకేశ్‌ టికాయత్‌ ప్రశ్నించారు. పలువురు అంతర్జాతీయ కళాకారులు, కార్యకర్తలు తమకు మద్దతివ్వడాన్ని ఆయన స్వాగతించారు. దిల్లీ-ఉత్తర్‌ప్రదేశ్‌ సరిహద్దులో గాజీపుర్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. అమెరికన్‌ పాప్‌ గాయని రీహానా, ఒకప్పటి శృంగార తార మియా ఖలీఫా, స్వీడన్‌ పర్యావరణ కార్యకర్త గ్రెటా తదితరులు ఉద్యమానికి మద్దతిస్తున్న విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా వారెవరో తనకు తెలియదని చెప్పారు. ‘‘అలాంటి వాళ్లు మద్దతిస్తే ఇవ్వొచ్చు. ఇందులో సమస్య ఏమిటి? వాళ్లు రైతులకేమీ ఇవ్వడం లేదు. మా నుంచి ఏమీ తీసుకెళ్లడం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో కిసాన్‌ పంచాయతీ..
రైతుల ఆందోళనకు మద్దతుగా పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని శామ్లీ జిల్లా భైన్‌స్వాల్‌ గ్రామంలో శుక్రవారం రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) ఆధ్వర్యంలో ‘కిసాన్‌ పంచాయతీ’ నిర్వహించారు. శామ్లీతో పాటు, పరిసర జిల్లాల నుంచి వేల మంది రైతులు ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో తరలివచ్చారు. జిల్లా అధికార యంత్రాంగం అనుమతివ్వకుండా నిషేధాజ్ఞలు విధించినప్పటికీ అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు. బీకేయూ సభ్యులతో పాటు ఆర్‌ఎల్‌డీ ఉపాధ్యక్షుడు జయంత్‌ చౌధరీ తదితరులు హాజరయ్యారు. పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న రైతు సమావేశాల్లో ఇది నాలుగోది. ఇప్పటికే ముజఫర్‌నగర్‌, మథుర, బాఘ్‌పట్‌లలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు.
* కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ శివార్లలో చేపట్టిన ఆందోళనకు రాజస్థాన్‌ రైతులు మద్దతు తెలిపారు. జైపుర్‌లో రాష్టీయ్ర లోక్‌తాంత్రిక్‌ పార్టీ ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని