మధ్యాహ్న భోజనం మరో 5 ఏళ్లు

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మరో అయిదేళ్లు కొనసాగించాలని ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయించింది.

Updated : 30 Sep 2021 10:59 IST

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

ఈనాడు, దిల్లీ: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మరో అయిదేళ్లు కొనసాగించాలని ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయించింది. 2021-22 నుంచి 2025-26 వరకు ఇది కొనసాగుతుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.54,061.73 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.31,733.17 కోట్లు ఖర్చు చేయనున్నాయి. కేంద్రం ఆహార ధాన్యాలపై అదనంగా రూ.45వేల కోట్లు వెచ్చించనుంది. దీంతో అయిదేళ్ల కాలానికి ఈ పథకంపై ప్రభుత్వాలు చేసే మొత్తం ఖర్చు రూ.1,30,794.90 కోట్లకు చేరనుంది. ఈ పథకం కింద అయిదేళ్ల పాటు ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు పిల్లలకు తాజాగా వండిన వేడివేడి భోజనం అందిస్తారు. దేశవ్యాప్తంగా 11.20 లక్షల పాఠశాలల్లో చదివే 11.80 కోట్ల మంది పిల్లలకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మధ్యాహ్న భోజన పథకం ఇకపై పీఎం పోషణ్‌ శక్తి నిర్మాణ్‌ స్కీమ్‌(పీఎం పోషణ్‌)గా కొనసాగనుంది.

* ప్రభుత్వ, ప్రభుత్వ సహాయంతో నడిచే పూర్వ ప్రాథమిక, బాలవాటికల్లో చదివే పిల్లలకూ దీన్ని వర్తింపజేస్తారు. ‘తిథి భోజనం’ పేరుతో స్థానిక ప్రజలను భాగస్వాములను చేసి ప్రత్యేక సందర్భాలు, పండుగల సమయంలో పిల్లలకు ప్రత్యేక భోజనం అందించేలా చూస్తారు.

* పాఠశాలల్లో పోషకాహార పంట తోటలను అభివృద్ధి చేస్తారు. విద్యార్థులకు తోటల పెంపకంతో పాటు, ప్రకృతితో మమేకమయ్యే విధానాన్ని ప్రోత్సహిస్తారు. ఈ తోటల నుంచి వచ్చే ఆకు కూరలు, కూరగాయల ద్వారా పిల్లలకు మరిన్ని సూక్ష్మ పోషకాలు అందించడానికి వీలవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే 3 లక్షల పాఠశాలల్లో ఇలాంటి తోటలు ఉన్నట్లు తెలిపింది.

* అన్ని జిల్లాల్లో ఈ పథకానికి సామాజిక ఆడిట్‌ను తప్పనిసరి చేసింది.

* రక్తహీనత సమస్య అధికంగా ఉన్న జిల్లాలు, ఆకాంక్షిత జిల్లాల్లో పిల్లలకు అనుబంధ పోషకాలు అందిస్తారు.

* సంప్రదాయ వంటకాలు, స్థానికంగా అందుబాటులో ఉండే దినుసులు, కూరగాయలతో సరికొత్త వంటకాలను ప్రోత్సహించడానికి గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వంటల పోటీలు నిర్వహిస్తారు.

* పథకం అమలులో రైతు ఉత్పత్తి సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు భాగస్వామ్యం కల్పిస్తారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు స్థానిక సంప్రదాయ వంటకాలను ప్రోత్సహిస్తారు.

* ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన విద్యార్థులు, రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, డిస్ట్రిక్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డైట్‌)కు చెందిన ట్రెయినీ టీచర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ పథకం అమలుతీరును పరీక్షించనున్నట్లు తెలిపింది.


రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లకు రూ.13,165 కోట్లు

కేంద్ర ప్రభుత్వం రూ.13,165 కోట్లతో రక్షణ ఉత్పత్తులను కొనుగోలుచేయాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలో బుధవారం దిల్లీలో సమావేశమైన రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఇందులో రూ.11,486 కోట్ల విలువైన ఉత్పత్తులను (87%) పూర్తిగా దేశీయ సంస్థల నుంచే సేకరించనున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది. భారత సాయుధ దళాల ఆధునికీకరణ, నిర్వహణ అవసరాల కోసం వీటిని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో రూ.3,850 కోట్లతో 25 అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్లను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) నుంచి సేకరించనున్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌, మేక్‌ ఇన్‌ ఇండియా లక్ష్యసాధన కోసం దేశీయ సంస్థల నుంచి వీటిని సేకరించాలని నిర్ణయించారు. అలాగే దేశీయంగా రూపకల్పన చేసి, అభివృద్ధి చేసిన ఆయుధాలకు ఊతమివ్వడం కోసం రూ.4,962 కోట్లతో రాకెట్‌ ఆయుధాల కొనుగోలుకు రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి ఆమోదం తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని