మాస్కు లేదంటే.. కేసు పలకరిస్తుంది!

రాష్ట్రంలో మళ్లీ మాస్కులు తప్పనిసరి చేయడంతో పోలీసుశాఖ రంగంలోకి దిగింది. మాస్కులు ధరించని వారిపై కేసుల నమోదుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి డీజీపీ కార్యాలయం రాష్ట్రవ్యాప్తంగా ఉత్తర్వులు

Published : 04 Dec 2021 05:23 IST

ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ కార్యాలయం
కొరడా ఝుళిపించేందుకు సిద్ధమవుతున్న పోలీసుశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మళ్లీ మాస్కులు తప్పనిసరి చేయడంతో పోలీసుశాఖ రంగంలోకి దిగింది. మాస్కులు ధరించని వారిపై కేసుల నమోదుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి డీజీపీ కార్యాలయం రాష్ట్రవ్యాప్తంగా ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాలని, ఆ తర్వాత కేసులు నమోదు చేయాలని వాటిలో పేర్కొన్నారు. కరోనా మొదలైనప్పటి నుంచీ నిబంధనలు పాటించేలా చేయడం, ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయడం వంటి వ్యవహారాలన్నీ పోలీసుశాఖే చూస్తోంది. రెండో విడత కరోనా విజృంభణ తగ్గిన తర్వాత మాస్కులు, కరోనా నిబంధనల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఒమిక్రాన్‌ అలజడి నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో మాస్కుల వినియోగంపై గత మార్చి నెలలోనే జారీ చేసిన ఆదేశాల ఆధారంగా ఇప్పుడు మళ్లీ కేసులు నమోదు చేయబోతున్నారు.

మళ్లీ కఠినంగా అమలు
కొత్తగా ఒమిక్రాన్‌ కల్లోలం నేపథ్యంలో మళ్లీ నిబంధనలన్నింటినీ పోలీసులు కఠినంగా అమలు చేయబోతున్నారు. కరోనా కట్టడి కోసం పోలీసుశాఖ అనేక ప్రయోగాలు చేసింది. మాస్కులు ధరించని వారిని గుర్తించి అప్రమత్తం చేసేలా కృత్రిమ మేధ ద్వారా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ తయారు చేసింది. దీన్ని సీసీ కెమెరాకు అనుసంధానం చేసింది. ఇది ఎక్కడైనా మస్కులు ధరించని వారుంటే వెంటనే సమీపంలో గస్తీ సిబ్బందిని అప్రమత్తం చేసేది. అలాగే ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతాలనూ సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గమనించేవారు. జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలను పర్యవేక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సబ్‌డివిజన్ల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. రెండో దశ కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో కొంత కాలంగా వీటిని పటిష్ఠంగా అమలు చేయడంలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ పోలీసుశాఖ క్రియాశీలమైంది. ఒకేసారి కేసులు నమోదు చేయడం మొదలుపెడితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగా అవగాహన కల్పించాలని భావిస్తున్నారు.


198 కొత్త కేసులు

రాష్ట్రంలో కొత్తగా 198 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,76,574కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో 2 మరణాలు సంభవించగా.. ఇప్పటివరకూ 3,997 మంది కన్నుమూశారు. తాజాగా 153 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 39,140 నమూనాలను పరీక్షించగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 82, రంగారెడ్డి 18, సంగారెడ్డి 15, హనుమకొండలో 11 చొప్పున కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని