మన ఊరు.. మన బస్తీ.. మన బడి

ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో మన ఊరు- మన బడి, పట్టణాల్లో మన బస్తీ- మన బడి పేరిట ఆధునికీకరించనుంది. మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు డిజిటలీకరణ చేయనుంది.

Published : 04 Feb 2022 03:56 IST

 రూ. 7,290 కోట్లతో పాఠశాలల అభివృద్ధి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో మన ఊరు- మన బడి, పట్టణాల్లో మన బస్తీ- మన బడి పేరిట ఆధునికీకరించనుంది. మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు డిజిటలీకరణ చేయనుంది. రానున్న మూడేళ్లలో రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో రూ.7289.54కోట్ల ఖర్చుతో సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. తొలి విడతలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9,123 బడుల్లో రూ.3497.62కోట్లతో పనులు చేపట్టనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలం యూనిట్‌గా అధిక ప్రవేశాలున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్ని ఎంపికచేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఈ పనుల మంజూరు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించిన ప్రభుత్వం.. ఒక మండలానికి ఒక ఏజెన్సీ ఉండాలని స్పష్టం చేసింది. పనుల నిర్వహణ బాధ్యతను అనుమతించి ఆర్థిక పరిమితికి లోబడి పాఠశాల యాజమాన్య కమిటీలు చేపట్టాలని, ప్రజాభాగస్వామ్యం తీసుకోవాలని సూచించింది. యాజమాన్య కమిటీలు ముందుకు రాకుంటే జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు.  

యాజమాన్య కమిటీలకు బాధ్యతలు
ఈ పథకానికి అవసరమైన నిధులను సమగ్ర శిక్షాఅభియాన్‌, ఉపాధిహామీ, ఏసీడీపీ, జిల్లా గ్రంథాలయ సంస్థ, నాబార్డు, జిల్లా, మండల పరిషత్‌ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. నిధుల సమీకరణకు ఆర్థికశాఖ నోడల్‌ ఏజెన్సీగా ఉంటూ అవసరమైనవాటిని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు అందుబాటులో పెట్టనుందని తెలిపింది. నిధుల ఖర్చుకు సంబంధించిన చెక్కులపై పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్‌, ప్రిన్సిపల్‌, సహాయ ఇంజినీర్‌, సర్పంచి సంతకాలు తప్పనిసరి. ఎవరైనా దాత రూ.2లక్షలు ఈ కార్యక్రమం కింద ఇస్తే కమిటీలో సభ్యుడిగా చేర్చుకోవచ్చు. రూ.10లక్షలు అంతకు ఎక్కువగా విరాళం ఇస్తే పాఠశాలలో ఒక తరగతి గదికి దాత సూచించిన పేరు పెడుతారు.
* మన ఊరు, మన బస్తీ, మన బడి కార్యక్రమం కింద చేపట్టే పనులపై ప్రభుత్వం సామాజిక తనిఖీని తప్పనిసరి చేసింది.  
* దాతలు ఇచ్చే విరాళాలతో చేపట్టే పనులను పర్యవేక్షించేందుకు ప్రతి బడిలో పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేయాలని సూచించింది. సంఘంలోని ఇద్దరు సభ్యులు, సర్పంచితో కలిసి కమిటీగా ఏర్పాటు కావాలి. ఈ కమిటీతో పాటు పాఠశాల యాజమాన్య కమిటీలోని ఇద్దరు సభ్యులు, ప్రధానోపాధ్యాయుడు.. దాతలు, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు, నిర్వహణ బాధ్యతలు పరిశీలించాలి. దాతలు ఇచ్చే నిధులను పూర్వ విద్యార్థుల సంఘంలోని ఇద్దరు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యయుడితో కూడిన సంయుక్త ఖాతాలో జమ చేయాలి. ఈ నిధులను జిల్లా కలెక్టరు అనుమతితో ఖర్చుచేయాలి. వీటిపై వచ్చే వడ్డీని పాఠశాల నిర్వహణ కోసం వినియోగించాలి.

పాఠశాలల్లో చేపట్టే పనులు...
* నీటివసతితో మరుగుదొడ్లు
* విద్యుదీకరణ, తాగునీటి సరఫరా
* విద్యార్థులు, అధ్యాపకుల కోసం ఫర్నీచర్‌
* ఉన్నత పాఠశాలల్లో లైబ్రరీ, కంప్యూటర్‌, సైన్స్‌ల్యాబ్‌లు
* పాఠశాలకు మొత్తం రంగులు వేయడం
* పెద్ద, చిన్న మరమ్మతులు, గ్రీన్‌చాక్‌ బోర్డులు
* ప్రహరీగోడలు, కిచెన్‌ షెడ్‌లు
* శిథిల గదుల స్థానంలో కొత్తవి నిర్మాణం
* ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాళ్లు
* డిజిటల్‌ విద్యకు అవసరమైన మౌలిక సదుపాయాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని